
మధుబని: ఓటు హక్కును కాపాడుకోవాలని ప్రజలకు కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఓటు హక్కు తోనే రాజ్యాంగాన్ని రక్షించుకోగలమని అన్నారు. బిహార్ లోని మధుబని, అరారియా, సుపౌల్ జిల్లాల్లో మంగళవారం రాహుల్ తన ‘ఓటరు అధికార్ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పబ్లిక్ ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తో బీజేపీ, ఎన్నికల సంఘం (ఈసీ) బాగోతం బట్టబయలైందన్నారు. కాషాయ పార్టీ నేతలు ఓటు దొంగలని విమర్శించారు. ‘‘ఈసీ సాయంతో బీజేపీ నేతలు ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు. ప్రజలందరూ కలిసి ఓట్ల చోరీకి అడ్డుకట్ట వేయాలి.
ఓటు హక్కును కాపాడుకుంటేనే రాజ్యాంగాన్ని రక్షించుకోగలం. లేకపోతే రాజ్యాంగం ప్రమాదంలో పడిపోతుంది. బిహార్ లో ఓటరు జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. అలాగే మరో 40, 50 ఏండ్లు తమదే అధికారం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంటున్నారు. ఆయన ఎందుకు అలా అంటున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఆయన వ్యాఖ్యల వెనుక ఓట్ల చోరీ బాగోతం ఉంది. గుజరాత్ నుంచే ఓట్ల దొంగతనం ప్రారంభమైంది” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఓట్ల చోరీపై గత కొద్ది రోజులుగా తాను ఆరోపణలు చేస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోదీ గానీ, అమిత్ షా గానీ నోరు విప్పడం లేదని మండిపడ్డారు.
ఆరెస్సెస్ కు రాజ్యాంగంపై గౌరవం లేదు
రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తుందని, అందుకే రాజ్యాంగాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) గౌరవించదని రాహుల్ ఆరోపించారు. వ్యక్తిగత దాడులు చేయడం ఆరెస్సెస్ విధానమని, మహాత్మా గాంధీని కూడా ఆరెస్సెస్ వదలలేదని ఫైర్ అయ్యారు. ‘‘మహాత్మా గాంధీ గురించి ఆరెస్సెస్ వారు అదేపనిగా దుష్ప్రచారం చేస్తారు. వాళ్ల విధానమే అది” అని రాహుల్ పేర్కొన్నారు. కాగా.. యాత్రలో ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్, సీపీఎంఎల్ లీడర్ దీపాంకర్ భట్టాచర్య తదితరులు పాల్గొన్నారు. అరారియా సిటీలో యాత్ర మధ్యలో ఓ డాబా వద్ద రాహుల్ టీ తాగారు.