
ఫతేఘర్ సాహిబ్: మన దేశం మత సామరస్యం, ఐకమత్యం, గౌరవానికి సూచిక అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకే తన భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందన్నారు. బీజేపీ మాత్రం ప్రజల్లో భయాన్ని, ద్వేషాన్ని వ్యాప్తిచేస్తోందని ఆరోపించారు. యాత్రలో రైతులు, చిన్న దుకాణదారులు, కూలీలు, నిరుద్యోగ యువత, మహిళలతో మాట్లాడి చాలా నేర్చుకున్నానని రాహుల్ చెప్పారు. రోజూ 25 కిలోమీటర్లు నడుస్తామని, ప్రజలు చెప్పేది వింటామని, వాళ్ల సమస్యలు వినేందుకే యాత్ర చేపట్టామని అన్నారు. జోడో యాత్ర పంజాబ్లో కొనసాగుతోంది. బుధవారం యాత్ర ప్రారంభానికి ముందు సర్హింద్లో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. అంతకుముందు సిక్కు గురుద్వారా ఫతేగర్ సాహిబ్ వద్ద తలపాగా ధరించి ప్రార్థనలు చేశారు. అనంతరం రౌజా షరీఫ్ దర్గాను రాహుల్ సందర్శించారు. ఇంకో 8 రోజుల పాటు జోడో యాత్ర పంజాబ్లో కొనసాగనుంది.
మీడియాకు సమస్యలు కన్పిస్తలేవా?
బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తుల వల్లే దేశంలో హింసాత్మక వాతావరణం వ్యాపించిందని, కులమతాలను, భాషను ఇతరులపై రుద్దుతూ దేశంలో మంచి వాతావరణాన్ని చెడగొట్టారని రాహుల్ ఆరోపించారు. అందుకే తాము ప్రేమ, ఐక్యత, అన్నదమ్ములమనే భావనను చూపించేందుకే యాత్రను ప్రారంభించామన్నారు. దేశంలో 24 గంటలు ప్రధాని మోడీనే చూపిస్తున్న మీడియా సంస్థలు.. పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం,పేదల సమస్యలపై చర్చించట్లేదన్నారు. దేశంలో అతిపెద్ద సమస్యలు ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని, వీటిపై పోరాడుతున్నామన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా మాట్లాడుతూ.. రైతులు, కార్మికులు, చిరువ్యాపారుల గొంతుకగా రాహుల్ నిలిచారని చెప్పారు.