ఆహా ఏమి రుచి.. మేఘాలయ పైనాపిల్స్‌కు రాహుల్ ఫిదా

ఆహా ఏమి రుచి..  మేఘాలయ పైనాపిల్స్‌కు రాహుల్ ఫిదా

 భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మేఘాలయలో ఉన్న కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి పైనాపిల్స్‌కు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా అవి తనకు లభించని అత్యంత రుచికరమైనవి అని అన్నారు. తన జీవితంలో ఇప్పటివరకు  ఇంత రుచికరమైన పైనాపిల్స్ ను తానెప్పుడూ తినలేదన్నారు. వీటి రుచి చూసిన వెంటనే రాహుల్ తన తల్లి సోనియాగాంధీకి ఫోన్  చేసి మీ కోసం రుచికరమైన పైనాపిల్స్‌ను తీసుకువస్తున్నానని చెప్పారు.  ఇంత  రుచి కలిగిన పైనాపిల్స్ ..  ప్రపంచం మొత్తానికి ఎందుకు అందుబాటులో లేవని రాహుల్ ప్రశ్నించారు.  రైతులు, స్థానిక వ్యాపారాలకు తమ ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే మౌలిక సదుపాయాలను భారత్ కల్పించే దిశగా కొత్త విజన్‌ని నిర్మించాలని రాహుల్ చెప్పారు.  

మరోవైపు భారత్‌‌‌‌ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా నిన్న అస్సాంలో పర్యటించిన రాహుల్ గాంధీని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకున్నారు.  దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తనను అడ్డుకోవడానికి గల కారణమేంటని సిబ్బందిని ప్రశ్నించారు. గుడిలోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణ యిస్తున్నారని విమర్శలు చేశారు. ‘‘వైష్ణవ సన్యాసి శ్రీమంత శంకర్‌‌‌‌దేవ్ జన్మస్థలాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించవచ్చు. అప్పుడు ఎలాంటి శాంతి భద్రతల సమస్య ఉండదు. కానీ రాహుల్ గాంధీ మాత్రమే వెళ్లలేరు”అని ఆయన మండిపడ్డారు. ‘‘మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నాం. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేమీ చేశాను..? మేం ఇక్కడకు వచ్చింది ప్రార్థించడానికి.. ఎలాంటి సమస్యలు సృష్టించడానికి కాదు’ అని రాహుల్ మీడియాతో మాట్లాడారు.