ప్రజలు కోరుకుంటే రాహులే ప్రధాని..ఆపే హక్కు అమిత్ షాకు ఎవరిచ్చారు?: జగ్గారెడ్డి 

ప్రజలు కోరుకుంటే రాహులే ప్రధాని..ఆపే హక్కు అమిత్ షాకు ఎవరిచ్చారు?: జగ్గారెడ్డి 
  • వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో 14 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదన్నారు. బుధవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలంతా కసితో పనిచేస్తారని చెప్పారు.

రాహుల్ ప్రధాని కాలేరని అమిత్ షా అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.దేశ ప్రజలు కోరుకుంటే రాహుల్ ప్రధాని అవుతారని, ఆయనను ఆపడానికి అమిత్ షా ఎవరని ప్రశ్నించారు. దేశ ఓటర్లను శాసించే హక్కు ఆయనకు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌‌‌‌‌‌‌‌ను ప్రధానిని చేసి అమిత్ షాకు సమాధానం చెబుతామని అన్నారు. రాముడి పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ.. ఆయన అడుగుజాడల్లో నడవడం లేదని విమర్శించారు. ప్రధాని పదవిని సున్నితంగా తిరస్కరించిన రాహుల్‌‌‌‌‌‌‌‌ను విమర్శించే హక్కు అమిత్ షాకు లేదన్నారు.

ప్రధాని పదవి పుట్టిందే రాహుల్ గాంధీ ఇంట్లో అని, ఈ విషయం అమిత్ షా తన ఇంట్లో పెద్దలను అడిగితే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. మరోసారి రాహుల్‌‌‌‌‌‌‌‌పై అనవసర వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన అమిత్ షా తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు.