బల్లారిలో ఓటేసిన రాహుల్ గాంధీ

బల్లారిలో ఓటేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్ష  ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంతో పాటు పీసీసీ కార్యాలయాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. పార్టీ సీనియర్ నేత చిదంబరం తొలి ఓటు వేశారు. అనంతరం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో  ఓటేశారు. 

బల్లారిలో రాహుల్ ఓటు..
భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష  ఎన్నికల ఓటింగ్లో పాల్గొన్నారు.  కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సంగనకల్లు క్యాంపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.  రాహుల్ గాంధీతో పాటే భారత్ జోడో యాత్రలో ఉన్న సీనియర్ నేత జైరాం రమేష్ కూడా అక్కడే క్యాంపులో ఓటువేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో ముందున్న మల్లిఖార్జున ఖర్గే బెంగళూరులో తన ఓటు వేశారు.  

19న ఫలితాలు..
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీకి చెందిన 9 వేల మంది ప్రతినిధులు ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లోని పీసీసీ కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ కు తరలించనున్నారు. ఈ నెల 19 పోలైన ఓట్ల లక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటిస్తారు.