
- దీనికి ప్రజా సమస్యలు పట్టవ్: రాహుల్ గాంధీ
- ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలి
- ఓటర్ అధికార్ యాత్ర’లో ప్రతిపక్ష నేత డిమాండ్
న్యూఢిల్లీ: గత లోక్ సభ ఎన్నికల్లో ఓట్లను చోరీ చేసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారని బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. గురువారం బిహార్ లోని ఔరంగాబాద్, ముంగేర్ జిల్లాలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ జరిగింది. ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు, యువకులతో రాహుల్ సంభాషించారు.
వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బిహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఓటు శక్తిని వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు న్యాయంగా, పారదర్శకంగా జరగాలంటే క్లీన్ ఓటరు లిస్టు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగంతో యువత భవిత నాశనం
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగంతో యువకుల జీవితాలు నాశనమవుతున్నాయని ‘ఎక్స్’ లో రాహుల్ గాంధీ అన్నారు. కానీ, కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా పెట్టుబడిదారుల ఖజానా నింపుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలను మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘నీట్, ఎస్సెస్సీ ఎగ్జామ్స్ లో పేపర్ లీక్ తో లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది.
సామాన్యుడి జీవితం దుర్భరంగా మారింది. ప్రభుత్వం.. పన్నుల మీద పన్నులు వేస్తూ దేశ ప్రజల నడ్డి విరుస్తోంది. ట్రెయిన్ యాక్సిడెంట్లు పెరిగాయి. రోడ్లు, బ్రిడ్జిలు వంటి మౌలిక సౌకర్యాలు ధ్వంసం కావడంతో వందల మంది చనిపోయారు. పహల్గాం నుంచి మణిపూర్ వరకు ఉగ్రదాడులు పెరిగాయి. అయినా కూడా కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కేంద్రం పట్టించుకోదు కూడా. ఎందుకంటే, ఓట్లు చోరీ చేసి అధికారంలోకి వచ్చిన వారు ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకుంటారు?” అని రాహుల్ వ్యాఖ్యానించారు.
నా ఐడియాలు నితీశ్ కాపీ చేశారు: తేజస్వీ
బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు విజన్ లేదని, తన ఐడియాలను ఆయన కాపీ కొట్టారని ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ అన్నారు. ఓటర్ అధికార్ యాత్రకు ముందు షేక్ పురాలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోతుందన్నారు. తమకు విజన్ ఉందని, అధికారంలోకి వచ్చేది తామే అని ధీమా వ్యక్తం చేశారు