చైనాను ఎదుర్కోవడానికి విజన్ కావాలి: రాహుల్

చైనాను ఎదుర్కోవడానికి విజన్ కావాలి: రాహుల్

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి ఇండో–చైనా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర సర్కార్‌‌తోపాటు ప్రధాని మోడీని టార్గెట్‌గా చేసుకొని విపక్ష నేత రాహుల్ పలుమార్లు విమర్శలకు దిగిన విషయం విధితమే. తాజాగా మరోమారు బార్డర్ వివాదంపై కేంద్రం మీద రాహుల్ మండిపడ్డారు. ప్రధాని మోడీ తన ఇమేజ్‌ను రూపొందించుకోవడంలో తలమునకలై ఉన్నారని.. కానీ ఒక్క మనిషి ఇమేజ్ మొత్తం దేశ ఇమేజ్ ఎంతమాత్రం కాదని రాహుల్ దుయ్యబట్టారు.

‘చైనాను మానసిక స్థైర్యంతో ఎదుర్కోవాలి. బలంగా వ్యవహరిస్తే వారిని ఎదుర్కోవచ్చు. ఒకవేళ మనం బలహీనులమని వారు గ్రహిస్తే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. ఓ విజన్ అనేది లేకుండా చైనాను ఎదుర్కోలేం. అది తప్పకుండా ఇంటర్నేషనల్ విజన్‌ అయి ఉండాలి. ఇండియాకు గ్లోబల్ విజన్ ఉండాలి. దేశానికి ఇప్పుడో ఐడియా కావాలి. అది ప్రపంచవ్యాప్త ఆలోచన అయ్యుండాలి. అదే ఇండియాను కాపాడుతుంది. అవును, మనకు సరిహద్దు వివాదం ఉంది. దాన్ని మనం పరిష్కరించాల్సిందే. అంతకంటే ముందు మనం మన ఆలోచనా ధోరణిని మార్చాల్సి ఉంటుంది. మనం సుదూరం లక్ష్యాలు పెట్టుకోవడం లేదు. అందుకే మనం కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకున్నాం. మన అంతర్గత సమతుల్యత దెబ్బతింది. అందుకే మనం పెద్దగా ఆలోచించడం లేదు. మనలో మనమే కొట్లాడుకుంటున్నాం. రాజకీయాలను చూడండి. ఇండియన్స్‌తో ఇండియన్స్ రోజంతా కొట్టుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మనకంటూ ఓ విజన్ లేదు. నా ప్రత్యర్థి ప్రధాని మోడీ. ఆయనను ప్రశ్నించడమే నా బాధ్యత. నేను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి ఒత్తిడి పెంచినప్పుడే ఆయన తన పనిని బాగా చేస్తారు. విజన్‌ను రూపొందించడమే ఆయన బాధ్యత. ఇప్పుడు అదే కొరవడింది’ అని రాహుల్ చెప్పారు.