మహిళల ఖాతాల్లో ఏటా రూ. లక్ష .. కాంగ్రెస్ మేనిఫెస్టోలో విప్లవాత్మక నిర్ణయాలు: రాహుల్

మహిళల ఖాతాల్లో ఏటా రూ. లక్ష .. కాంగ్రెస్ మేనిఫెస్టోలో విప్లవాత్మక నిర్ణయాలు: రాహుల్

భోపాల్: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల బ్యాంక్ అకౌంట్లల్లో ఏటా రూ. లక్ష జమ చేస్తామని వెల్లడించారు. సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని మండ్ల లోక్‌సభ నియోజకవర్గం, ధనోరాలో ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.."ఆశా, అంగన్వాడీ వర్కర్లకు చెల్లిస్తున్న వేతనం రెట్టింపు చేయటం, దేశంలోని ప్రతి నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఒక ఏడాది పాటు వేతనంతో కూడిన అప్రెంటిస్‌షిప్ పొందేలా  కొత్త చట్టాన్ని తీసుకురావడం వంటివి కాంగ్రెస్ మేనిఫెస్టోలోని విప్లవాత్మక హామీలు. అలాగే.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే.. ఉద్యోగాల్లో కాంట్రాక్టు వ్యవస్థకు స్వస్తి చెబుతం. ప్రభుత్వ రంగంలో 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తం. రైతులు పండించిన పంటలకు సరిపడా ఎంఎస్పీ వచ్చేలా చట్టం రూపొందిస్తం" అని రాహుల్ వివరించారు. 

అడవి, నీరు, భూమిపై గిరిజనులకు ఉన్న హక్కులను బీజేపీ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించిన ఆయన..వారి భూములను పారిశ్రామికవేత్తలకు అప్పగించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మండ్ల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కమ్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది.