రైతుల కష్టాన్ని ప్రపంచం చూస్తోంది కానీ.. ప్రధాని పట్టించుకోవట్లే!

రైతుల కష్టాన్ని ప్రపంచం చూస్తోంది కానీ..  ప్రధాని పట్టించుకోవట్లే!

అగ్రి బిజినెస్​ను మోడీ తన దోస్తులకివ్వాలని చూస్తుండు
అగ్రిచట్టాలను రద్దు చేసేంత వరకూ కేంద్రంపై పోరాడాలె
కేరళ వయనాడ్​లో ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ గాంధీ  

వయనాడ్ (కేరళ): మన దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను మొత్తం ప్రపంచం చూస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల బాధలను అర్థం చేసుకోవడంలేదని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కేరళలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గంలో సోమవారం ఆయన రైతులకు మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై పాప్ స్టార్లు కూడా మాట్లాడుతున్నారు కానీ కేంద్రం మాత్రం ఇంట్రెస్ట్ చూపడంలేదన్నారు. ‘‘రూ.40 లక్షల కోట్ల విలువైన అగ్రికల్చర్ రంగం దేశంలోనే అతిపెద్ద బిజినెస్. ఇది కోట్లాది మంది రైతులకే సొంతం. భారత మాతకు చెందిన ఏకైక బిజినెస్ వ్యవసాయమే. దీనిని ఇప్పుడు కొంతమంది సొంతం చేసుకోవాలనుకుంటున్నరు. అగ్రికల్చర్ బిజినెస్​ను ప్రధాని మోడీ తన ఫ్రెండ్స్​కు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు” అని రాహుల్ ఆరోపించారు. కొత్త అగ్రిచట్టాలను రద్దు చేసేదాకా పోరాడాలని రైతులకు పిలుపునిచ్చారు.

ఉపాధి హామీని ఎగతాళి చేసిన్రు..

ప్రధానిగా నరేంద్ర మోడీ పదవిని చేపట్టినప్పుడు ఉపాధి హామీ పథకాన్ని పార్లమెంటులోనే ఎగతాళి చేశారని, ఈ పథకం దేశ ప్రజలకు అవమానకరమని మాట్లాడారని రాహుల్ చెప్పారు. కానీ కరోనా విపత్తు సమయంలో ఈ ఒక్క పథకమే మన ప్రజలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిందన్న నిజాన్ని మోడీ అంగీకరించక తప్పలేదన్నారు.

ఫ్రెండ్స్ జేబులు నింపుతున్రు..

పెట్రోల్ ధరల పెరుగుదలపై రాహుల్ మరోసారి మండిపడ్డారు. ‘పెట్రోల్ రూ. 100కు చేరింది. ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్ మెన్ జేబులను ఖాళీ చేసి.. కొంతమంది ఫ్రెండ్స్ జేబులను నింపుతోంది’ అని ట్వీట్ చేశారు. ‘ఫ్యూయెల్ లూట్ బీజేపీ’ అనే హ్యాష్ ట్యాగ్​ను జత చేశారు.