వయనాడ్‌ను వదులుకున్న రాహుల్‌.. బరిలో దిగనున్న ప్రియాంక

వయనాడ్‌ను వదులుకున్న రాహుల్‌.. బరిలో దిగనున్న ప్రియాంక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ సీటుకు రాజీనామా చేస్తున్నారని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు రాహుల్ గాంధీ రాయ్​బరేలీ ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేశారు. గాంధీ కుటుంబానికి రాయ్​బరేలీ నియోజకవర్గంతో ఎన్నో ఏండ్ల నుంచి అనుబంధం ఉందన్నారు. పార్టీకి కూడా ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ నేతలు, రాయ్​బరేలీ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ హైలెవల్ మీటింగ్ తర్వాత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. రాహుల్​పై వయనాడ్ ప్రజలు చూపిన ప్రేమను ఎప్పటికీ పార్టీ మరిచిపోదని తెలిపారు. త్వరలోనే రాహుల్ గాంధీ రాజీనామా సమర్పిస్తారని చెప్పారు. వయనాడ్ లోక్​సభ బై ఎలక్షన్​లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రకటించారు. 

రాహుల్​ను గెలిపించినట్టే.. ప్రియాంక గాంధీని కూడా బంపర్ మెజార్టీతో గెలిపించాలని వయనాడ్ ఓటర్లను మల్లికార్జున ఖర్గే కోరారు. ‘‘నేను అమ్మాయిని.. పోరాడగలను’’ అనే ప్రియాంక గాంధీ నినాదాన్ని ఖర్గే గుర్తు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘‘వయనాడ్ ప్రజలతో నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. 2019లో నన్ను గెలిపించారు. 2024లో రాయ్​బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచాను. మా కుటుంబానికి రాయ్​బరేలీతో కొన్ని దశాబ్దాల అనుబంధం ఉంది. అందుకే ఎంతో బాధతో వయనాడ్ సీటును వదులుకుంటున్న’’అని రాహుల్ అన్నారు. ఎంతో కష్టంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వయనాడ్ బై ఎలక్షన్​లో ప్రియాంక గాంధీని బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

పోటీకి నేను సిద్ధం: ప్రియాంక గాంధీ

‘‘వయనాడ్‌‌ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు నేను రెడీగా ఉన్న. రాయ్ బరేలిలో రాహుల్​కు ఎప్పుడూ మద్దతుగా ఉంటా. కష్టకాలంలో వయనాడ్ నుంచి రాహుల్​ను గెలిపించారు. ఇప్పుడు నేను పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తది. రాహుల్ మాదిరి నన్ను కూడా బంపర్ మెజారిటీతో గెలిపించండి’’ అని ప్రియాంక గాంధీ కోరారు. వయనాడ్​కు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించడం లేదని బాధపడొద్దన్నారు. రాయ్​బరేలీతో తమకు చాలా ఏండ్ల నుంచి అనుబంధం ఉందని తెలిపారు. 20 ఏండ్ల పాటు రాయ్​బరేలీకి సేవ చేశానన్నారు. వయనాడ్ ఎంపీగా తనను గెలిపిస్తే ఇద్దరం ఇక్కడి ప్రజలకు సేవ చేస్తామని ప్రియాంక చెప్పారు.