యాసిడ్‌‌‌‌ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ..పాలసీ రూపొందించాలని రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశం

యాసిడ్‌‌‌‌ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ..పాలసీ రూపొందించాలని రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: యాసిడ్‌‌‌‌ బాధితులను ఆదుకునే విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యాసిడ్‌‌‌‌ అటాక్స్‌‌‌‌ విక్టిమ్స్‌‌‌‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఒక పాలసీ రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే బాధితుల జీవనాధారం కోసం భత్యం చెల్లించేలా పాలసీ చేయాలని చెప్పింది. ఈ మేరకు సోమవారం జస్టిస్‌‌‌‌ సూర్యకాంత్‌‌‌‌, జస్టిస్‌‌‌‌ జోయ్‌‌‌‌మాల్యా బాగ్చిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ విభాగాలు/ఏజెన్సీలలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేరో కారణాలు చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. హర్యానాకు చెందిన యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్‌‌‌‌ మాలిక్‌‌‌‌ కేసును విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యాసిడ్‌‌‌‌ దాడి బాధితులు బ్యాంకు అకౌంట్లు తెరవడం, ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డులు పొందడం, ఆస్తిని రిజిస్ట్రేషన్‌‌‌‌, అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయడం, మొబైల్‌‌‌‌ సిమ్‌‌‌‌ కార్డుల కొనుగోలు చేయడంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు.

దీంతో పాటు యాసిడ్ బాధితులకు కేవైసీ రిజిస్ట్రేషన్‌‌‌‌ సమస్యలను కూడా కోర్టులో పిటిషనర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా లేవనెత్తారు. ముఖ్యంగా విద్యార్థుల వివరాలను డిజిటల్‌‌‌‌గా నమోదు చేసే సమయంలో ఐరీష్‌‌‌‌ ఇవ్వడం, బయోమెట్రిక్‌‌‌‌ వేయడం బాధితులకు సాధ్యపడటం లేదని చెప్పారు. ఈ కేసులో నిందితుడిని ట్రయల్‌‌‌‌ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన షాహీన్‌‌‌‌ మాలిక్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా, యాసిడ్‌‌‌‌ దాడి కేసుల్లో కఠినమైన శిక్షలు అవసరం ఉందని సుప్రీంకోర్టు గతంలోనే వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో అసాధారణ చర్యలు తీసుకోవాలని చెప్పింది. బాధితులకు పరిహారం చెల్లించడానికి నిందితుల ఆస్తులను అటాచ్‌‌‌‌ చేసి, వేలం వేయాలని సూచించింది.