భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చిస్తాం.. రాహుల్ హామీ

భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చిస్తాం.. రాహుల్ హామీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి జనవరి 14న మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించారు. మణిపూర్ నుంచి ముంబై వరకు సాగే ఈ ప్రయాణం 6వేల 700 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి దేశంలోని 11 రాష్ట్రాల గుండా వెళుతుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక న్యాయం వంటి సామాజిక సమస్యలపై దృష్టి సారించిన ఈ యాత్ర.. ఈ రోజు మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుండి ప్రారంభమైంది.

మణిపూర్ హింసాకాండపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతూ.. రాహుల్ గాంధీ తన ప్రారంభ ప్రసంగం చేశారు. తాను 2004 నుండి రాజకీయాల్లో ఉన్నానని, భారతదేశంలోని మొత్తం మౌలిక సదుపాయాలు కుప్పకూలిన ప్రదేశాన్ని మొదటిసారి సందర్శించానన్నారు. జూన్ 29 ముందుకు ఉన్న మణిపూర్.. ఇప్పుడున్న మణిపూర్ ఒకటి కాదన్న ఆయన.. అదిప్పుడు విభజించబడిందని చెప్పారు. ప్రతిచోటా విద్వేషం వ్యాపించిందని, లక్షల మంది ప్రజలు నష్టపోయారని రాహుల్ ఆరోపించారు. ప్రజలు తమ కళ్ల ముందే తమ ప్రియమైన వారిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు, భారత ప్రధాని మిమ్మల్ని కలవడానికి కూడా ఇక్కడకు రాలేదని, ఇది నిజంగా సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కి మణిపూర్‌ భారతదేశంలో భాగం కాకపోవచ్చని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

మణిపూర్ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వాగ్దానం చేస్తూ.. మీరు (ప్రజలు) మీరు విలువైనది కోల్పోయారు, కానీ ఇదే సమయంలో మీకు విలువైన వాటిని మేము మరోసారి కనుగొని మీకు తిరిగి తీసుకువస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. మణిపూర్ ప్రజల బాధను తాము అర్థం చేసుకున్నామన్నారు. మీరు అనుభవించిన బాధ, నష్టాన్ని అర్థం చేసుకున్నామని, ఈ రాష్ట్రంలో ఇంతకుముందున్న సామరస్యాన్ని, శాంతిని, ఆప్యాయతను తిరిగి తీసుకువస్తామని రాహుల్ వాగ్దానం చేశారు.

ప్రారంభోత్సవం సందర్భంగా, యాత్రలో రాహుల్ గాంధీ ప్రయాణించే బస్సును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆవిష్కరించారు. రాజ్యాంగ పీఠికను కాపాడే లక్ష్యంతో రాహుల్ గాంధీ పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్నారని ఖర్గే తన ప్రసంగంలో పేర్కొన్నారు. మణిపూర్‌లో కేవలం ఓట్లు రాబట్టేందుకే ప్రధాని మణిపూర్‌లో ఉన్నారని, అయితే మణిపూర్‌ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన పర్యటించలేదని వ్యాఖ్యానించారు.