తెలంగాణ నుంచి లోక్సభ బరిలో రాహుల్ గాంధీ!

తెలంగాణ నుంచి లోక్సభ బరిలో రాహుల్ గాంధీ!

తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.  దీంతో అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయిస్తే పార్టీకి మరింత  బలం చేకూరుతుందని రాష్ట్ర నాయకులు అంచనా వేస్తున్నారు.   

కాంగ్రెస్ అగ్రనాయకురాలు  సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా పార్టీలోని కీలక నేతలు  భావించారు. ఈ క్రమంలో ఆమెతో చర్చించారు కూడా. కానీ  ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని సోనియా వెల్లడించారు.  ఈ క్రమంలో రాహుల్ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ఈ సారి తెలంగాణలోని ఖమ్మం లేదా భువనగిరి నుంచి  రాహుల్ గాంధీని పోటీ చేయించాలని  పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులతో  సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది.  అయితే రాహుల్ పోటీపై  అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 

తెలంగాణతో పాటుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నుంచి కూడా రాహుల్ గాంధీ ఈ సారి పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం నడుస్తోంది.  ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ కు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడి నుంచి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో  సీపీఐ పోటీ చేస్తున్నట్లు తెలిపింది.  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి యాని రాజాను అక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. విపక్ష ఇండియా కూటమిలోని ఇతర పార్టీలతో కాంగ్రెస్‌ ప్రస్తుతం సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతోంది.