హత్రాస్ విషాదంపై ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదు

హత్రాస్ విషాదంపై ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదు

పటియాలా: హత్రాస్, బల్‌‌రాంపూర్ గ్యాంగ్‌‌రేప్ ఘటనలతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను ఖండిస్తూ విపక్షాలు నిరసనలు చేశాయి. దీనిపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి స్పందిస్తూ హత్రాస్ ఘటనపై అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని రీసెంట్‌‌గా అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ఈ విషాదాన్ని ఓ కుట్రగా చూడటం ఏంటంటూ మండిపడ్డారు. పటియాలాలో జరిగిన ఖేతీ బచావో యాత్రలో భాగంగా రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు.

‘యోగీజీ తన అభిప్రాయం చెప్పారు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఓ అమ్మాయి తీవ్ర వేధింపులకు గురైంది. ఆమె గొంతును నులిమారు. బాధితురాలి కుటుంబీకులను భయపెట్టారు. అయినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ దీన్ని యోగీజీ అంతర్జాతీయ కుట్రగా భావిస్తున్నట్లయితే అది ఆయన ప్రత్యేక హక్కు అవుతుంది. కానీ నేను మాత్రం దీన్నో విషాదంగా చూస్తున్నా. ఇదో విషాదం అని చెప్పే ధైర్యం యూపీ సీఎంకు ఉండాల్సింది. బాధితురాలి ఫ్యామిలీని ఆయన రక్షించాలి’ అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్‌‌తోపాటు ర్యాలీలో పాల్గొన్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా హత్రాస్ ఘటనపై స్పందించారు. ‘వాళ్ల సొంత కూతురుపై అత్యాచారం జరిగింది. ఆమెను చంపేశారు. అయినా ఆ రాష్ట్ర పాలనా యంత్రాంగం మాత్రం బాధితురాలి కుటుంబీకులపై దాడి చేస్తోంది. ఈ ఘటనపై ఇంతవరకూ దేశ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అని అమరీందర్ మండిపడ్డారు.