దేశ ద్రోహుల్లారా వినండి.. ఎప్పటికైనా శిక్ష తప్పదు: ఈసీ, బీజేపీపై రాహుల్ విమర్శల దాడి

దేశ ద్రోహుల్లారా వినండి.. ఎప్పటికైనా శిక్ష తప్పదు: ఈసీ, బీజేపీపై రాహుల్ విమర్శల దాడి

న్యూఢిల్లీ: ఓట్ చోరీ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఓటర్ జాబితాలోని అవకతవకలను ఎత్తిచూపుతూ ఈసీ బీజేపీకి అమ్ముడుపోయిందంటూ దాడిని పెంచిన రాహుల్.. తాజాగా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‎ను ఓడించేందుకు ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఓట్ల దొంగతనం కేవలం ఎన్నికల కుంభకోణమే కాదని.. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడమేనని అన్నారు

దేశ ద్రోహుల్లారా వినండి.. కాలం మారుతోంది.. ఓట్ల దొంగలకు శిక్ష  తప్పదని హెచ్చరించారు రాహుల్ గాంధీ. రాజ్యాంగబద్ధ సంస్థ అయినా ఎన్నికల కమిషన్ ఎలక్షన్ డిజిటల్ డేటాను ఎందుకివ్వదని ప్రశ్నించిన రాహుల్.. డిజిటల్ డేటా ఇస్తే నిజం నిగ్గు తేలుతుందన్నారు. మొత్తం ఐదు రకాలుగా ఓటర్ జాబితాల్లో దొంగతనం జరుగుతోందని ఆరోపించారు. డూప్లికేట్ ఓటర్, ఫేక్ అడ్రస్, ఒకే అడ్రస్ లో చాలా ఓట్లు, తప్పుడు ఫొటోలు, ఫామ్ 6  దుర్వినియోగం తదితర కారణాలతో ఈ వ్యవహారం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. 

2024 లోక్‌‌సభ ఎన్నికల సమయంలో కర్నాటకలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌‌లోని ఓటరు జాబితాలో భారీగా అవకతవకలు జరిగినట్లు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన మీడియాకు వివరించారు.  2024 లోక్‌‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ సెగ్మెంట్​లోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,250 నకిలీ ఓట్లు ఉన్నాయని రాహుల్​ తెలిపారు.