
- మహారాష్ట్ర, హర్యానా, యూపీ, బిహార్‌లోనూ ఓట్లు చోరీ చేసిన్రు
- ఇదంతా ఒక సిస్టమ్ కనుసన్నల్లో జరుగుతున్నది
- ఓట్ల దొంగలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నరు
- ఓట్ల చోరీపై విచారిస్తున్న కర్నాటక సీఐడీకి సమాచారం ఇవ్వట్లేదు
- 18 నెలల్లో 18 లేఖలు రాసినా స్పందించలేదని ఫైర్
- వారంలోగా సీఐడీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని డిమాండ్
న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతున్నదని, సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి చేస్తున్నారని తెలిపారు. కర్నాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఓటర్లను తొలగించారని చెప్పారు. నకిలీ లాగిన్‌లు, ఫోన్ నెంబర్లను ఉపయోగించి.. రాష్ట్రం బయట నుంచి ఈ పని చేశారని వివరించారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
ఓట్ల చోరీపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దేశంలో ప్రతి ఎన్నిక టైమ్‌లో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ‘‘దేశంలో ఎన్నికలు జరిగే ప్రతీసారి ఓటర్లను కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఓటు వేసేటోళ్లను, మైనార్టీలు, దళితులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మందిని తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. నేను మన దేశాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నాను. నేను ఆధారాలు లేకుండా ఇదంతా చెప్పడం లేదు. నా దగ్గర 100% ప్రూఫ్ ఉంది. ఇక నిర్ణయం మీ (ప్రజలు) చేతుల్లోనే ఉంది” అని అన్నారు.
తొలగింపు.. నమోదు
సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటర్లను తొలగించడం, నమోదు చేయడం లాంటివి చేస్తున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. ఇందుకు కర్నాటకలోని అలంద్, మహారాష్ట్రలోని రాజూరా నియోజకవర్గాలను ఉదాహరణగా పేర్కొన్నారు. రాజూరాలో అక్రమంగా 6,850 మంది ఓటర్లను నమోదు చేశారని చెప్పారు. అలంద్‌లో 6,018 మంది ఓటర్లను తొలగించేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. అయితే ఆ బండారమంతా బయటపడిందని చెప్పారు. ‘‘అలంద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటర్లను తొలగించేందుకు కొందరు ప్రయత్నాలు చేశారు. తన అంకుల్ ఓటు డిలీట్ అయినట్టు, అది పక్కింటి ఆయనే డిలీట్ చేయించినట్టు బూత్ లెవల్ ఆఫీసర్ గుర్తించారు. దీంతో పక్కింటి వ్యక్తిని ఆమె అడిగారు. అయితే దాని గురించి తనకేం తెలియదని అతను చెప్పాడు. ఈ క్రమంలో ఇదంతా ఎవరో వేరే వ్యక్తులు చేస్తున్నారని నిర్ధారణ అయింది” అని వెల్లడించారు. ఈ సెగ్మెంట్‌లో ఓట్ల డిలీట్ కోసం మొత్తం 6,018 అప్లికేషన్లు వచ్చాయని, నకిలీ ఫోన్ నెంబర్ల ద్వారా రాష్ట్రం బయట నుంచి ఇదంతా ఎవరో చేశారని వివరించారు.
అంతా ఆన్‌లైన్‌లో..
అమాయకుల ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఓటర్లను తొలగించడం, నమోదు చేయడం లాంటివి చేస్తున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. ఓటు డిలీట్ అయిన వ్యక్తికి, అది డిలీట్ చేయించిన వ్యక్తికి కూడా ఆ విషయం తెలియదని చెప్పారు. అలాగే ఓటర్‌గా నమోదైన వ్యక్తికి కూడా ఆ విషయం తెలియదని పేర్కొన్నారు. ‘‘ఇదంతా ఒక్కటే ప్రక్రియ. దేశమంతా ఓట్ల చోరీ జరుగుతున్నది. కొన్నిచోట్ల ఓటర్లను తొలగిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లను యాడ్ చేస్తున్నారు. నకిలీ ఫోన్ నెంబర్ల ద్వారా వేరే చోటు నుంచి ఆన్‌లైన్ ద్వారా ఇదంతా చేస్తున్నారు” అని వెల్లడించారు. ‘‘ఇదంతా ఒక సిస్టమ్ కనుసన్నల్లో జరుగుతున్నది. కర్నాటక, మహారాష్ట్రలో చేస్తున్నారు. ఇంతకుముందు హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో చేశారు. వీటికి సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి” అని పేర్కొన్నారు.
దొంగలను కాపాడుతున్నది సీఈసీనే..
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీకి పాల్పడినోళ్లను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసినోళ్లను ఆయన కాపాడుతున్నారని మండిపడ్డారు. ‘‘కర్నాటకలో జరిగిన ఓట్ల చోరీపై రాష్ట్ర సీఐడీ విచారణ చేస్తున్నది. ఈ క్రమంలో ఓటర్ల తొలగింపునకు సంబంధించి ఏ ఐపీ అడ్రస్ నుంచి అప్లికేషన్లు వచ్చాయి? ఏ నంబర్లకు ఓటీపీలు వచ్చాయి? అనే వివరాలు ఇవ్వాలని ఈసీని సీఐడీ కోరింది. ఇందుకోసం 18 నెలల్లో 18 లెటర్లు రాసింది. కానీ ఈసీ ఆ వివరాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఓట్ల దొంగలను మేం పట్టుకుంటామని వాళ్లకు అర్థమైంది. ఓట్ల చోరీకి పాల్పడినోళ్లను సీఈసీ కాపాడుతున్నారని చెప్పడానికి ఇంతకంటే ఆధారం ఇంకేం కావాలి?” అని ప్రశ్నించారు. ‘‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. ఓట్ల చోరీకి పాల్పడేటోళ్లను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేటోళ్లను కాపాడడం ఆపండి. కర్నాటక సీఐడీ అడిగిన సమాచారం వారంలోగా ఇవ్వండి. లేదంటే రాజ్యాంగంపై దాడి చేస్తున్నోళ్లను జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారని కచ్చితంగా
తెలుస్తుంది” అని అన్నారు.
ప్రజాస్వామ్యం హైజాక్..
ఓట్ల దొంగలెవరో ఈసీకి తెలుసునని రాహుల్ గాంధీ తెలిపారు. ‘‘మన దేశ ప్రజాస్వామ్యం హైజాక్ అయింది. దాన్ని రక్షించగలిగేది ప్రజలు మాత్రమే. ఓట్లు చోరీ చేస్తున్నదెవరో ఈసీకి తెలుసు. అది దేశంలోని యువత అందరికీ తెలియాలి. అందుకోసమే నేను పోరాడుతున్నాను. కానీ ఈసీ సమాచారం ఇవ్వడం లేదు. రాజ్యాంగాన్ని హత్య చేసినోళ్లను రక్షిస్తున్నది. నిజాలను ప్రజల ముందుంచాను. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరుగుతున్నదని ప్రజలు అర్థం చేసుకున్న రోజు నా పని పూర్తయినట్టే” అని పేర్కొన్నారు. అసలు ఓట్ల చోరీకి సూత్రధారి ఎవరని మీడియా ప్రశ్నించగా.. ‘‘అది కూడా బయటపెడతాను. నేను ఇంకా హైడ్రోజన్ బాంబు పేల్చలేదు. దాన్ని త్వరలోనే పేలుస్తాను. అప్పుడు అన్ని వివరాలు బయటకొస్తాయి” అని రాహుల్ జవాబిచ్చారు. కాగా, ఓట్ల చోరీ వ్యవహారంలో తాను ఇప్పటికే అణుబాంబు పేల్చానని, ఇక త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేలుస్తానని గతంలో రాహుల్ అన్నారు.
ఓటు తొలగించాలని ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు..
ఓటరు జాబితా నుంచి ఎవరి పేరునైనా తొలగించాలంటే ఫారం 7 నింపి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేయాలి. తమ నియోజకవర్గంలోని ఏ ఓటర్‌పైన అభ్యంతరం ఉన్నా.. ఆ ఓటరు పేరు తొలగించాలని ఆ సెగ్మెంట్‌లోని ఎవరైనా ఇలా దరఖాస్తు చేయవచ్చు. దీనిపై ఫీల్డ్‌లో ఎంక్వైరీ చేసిన తర్వాత ఈఆర్‌వో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.