కుల గణన చేపట్టి... జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తాం: రాహుల్ గాంధీ

కుల గణన చేపట్టి... జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తాం: రాహుల్ గాంధీ

రోగనిర్ధారణ చేశాకే రోగికి చికిత్స అందించాలని ఈ ప్రభుత్వాలు మరిచాయని.. కుల గణన వల్లే సంక్షేమ కార్యక్రమాలు సరిగా అందుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.  మూడో రోజు బస్సు యాత్రలో భాగంగా జగిత్యాలలో కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నెహ్రూ గాంధీ, ఇందిర గాంధీ తరతరాల నుండి ప్రజలతో మాకు అనుబంధం ఉందన్నారు.  లోక్ సభ సభ్యత్వం పోయాక ఢిల్లీలోని తన ఇంటిని ఖాళీ చేయించారని,  తన ఇల్లు.. దేశ ప్రజల హృదహాల్లో ఉందన్నారు. బలహీనవర్గాల జనాభా లెక్కలు ఉండాలని పార్లమెంట్ లో కేంద్రాన్ని కోరానని చెప్పారు.

ఓబీసీలు దేశానికి వెన్నెముక లాంటివారని.. ఓబీసీలకు అండగా నిలిచేందుకు మోదీ, కెసిఆర్ లు సిద్ధంగా లేరని మండిపడ్డారు. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం, కెసిఆర్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు. దేశాన్ని నడిపించే అధికారుల్లో 90 శాతం అగ్రవర్ణాలవారే ఉన్నారని... బడ్జెట్ కేటాయింపు చేసేది కూడా ఈ 90 శాతం అగ్రవర్ణ అధికారులేనని అన్నారు. ఓబీసీల జనసంఖ్య ఎంతో లెక్కలు ఎందుకు తీయడం లేదని ప్రశ్నించారు. బడ్జెట్ లో ఓబీసీలకు ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు.

దేశంలో, రాష్ట్రంలో ఓబీసీలు 50శాతం వరకు ఉన్నారని.. బడ్జెట్ లో ఓబీసీలకు 5 శాతమే కేటాయిస్తున్నారని తెలిపారు. ప్రజల జేబు నుంచి డబ్బు సేకరించి అదానీ జేబులోకి పంపిస్తున్నారని ఆరోపించారు. మేం వచ్చాక రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని... బలహీనవర్గాల జనసంఖ్య మేరకు వారికి బడ్జెట్ కేటాయిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.