కీలక నియామకాల్లో రాహుల్ ​గాంధీ ముద్ర

కీలక నియామకాల్లో రాహుల్ ​గాంధీ ముద్ర
  •     సీబీఐ నుంచి ఎలక్షన్​ కమిషన్​ వరకు ఎంపిక ప్యానెల్​లో చోటు
  •     పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రాహుల్​
  •     ప్రధానితో సమానంగా ఒపీనియన్​ చెప్పే చాన్స్​ 

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఇక సీబీఐ నుంచి మొదలుకొని ఎలక్షన్​ బాడీ వరకు కీలక నియామకాల్లో పాల్గొననున్నారు.  రాహుల్​గాంధీని లోక్​సభలో ప్రతిపక్ష నేతగా  స్పీకర్​ ఓం బిర్లా గుర్తిస్తూ బుధవారం నోటిఫికేషన్​ విడుదల చేశారు. ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్ ​నాయకుడు రాహుల్​గాంధీని జూన్​ 9 నుంచి లోక్​సభలో ప్రతిపక్ష నేతగా అధికారికంగా గుర్తిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్​లోని రాయ్​బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్​ను పార్లమెంట్​లో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం 1977లోని సెక్షన్​ 2 ప్రకారం అపొజిషన్​ లీడర్​గా గుర్తిస్తున్నట్టు తెలిపారు. 

దీంతో సీబీఐ డైరెక్టర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌‌‌‌పర్సన్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ వంటి కీలక అధికారుల నియామక ప్రక్రియలో పాలుపంచుకొనే అధికారం రాహుల్​కు దక్కింది. ఈ నియామకాల్లో చాలా వరకు ఎంపిక ప్యానెల్​లో   ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మంత్రి ఉంటారు. దీంతో ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానితో సమానంగా కీలక నియామకాల్లో రాహుల్​గాంధీ తన అభిప్రాయాన్ని చెప్పొచ్చు. పబ్లిక్ అండర్ టేకింగ్స్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీల్లో, పార్లమెంటులో ఏర్పాటు చేసే పలు జాయింట్ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉంటారు. 

పార్లమెంట్ లో గవర్నమెంట్ పాలసీలను విమర్శించే స్వేచ్ఛ అపొజిషన్ లీడర్ గా రాహుల్​గాంధీకి ఉంటుంది. అలాగే, క్యాబినెట్​ మినిస్టర్​ హోదాతోపాటు పార్లమెంట్​ బిల్డింగ్​లో సిబ్బందితోకూడిన కార్యాలయం ఉంటుంది.  ఢిల్లీలో క్యాబినెట్ మంత్రులుండే ఇంటిని ఆయనకు కేటాయిస్తారు.  డ్రైవరు సహా కారు సదుపాయం ఉంటాయి. అలాగే, అపొజిషన్​ లీడర్​గా రాహుల్​గాంధీ ప్రత్యేకంగా వ్యక్తిగత సిబ్బంది కేటాయించుకునే సదుపాయం ఉంటుంది. 

తొలిరోజు తెల్లని కుర్తా, పైజామాలో రాహుల్​

ప్రతిపక్ష నేతగా రాహుల్​గాంధీ తొలిరోజు తెల్లని కుర్తా, పైజామాలో పార్లమెంట్​ హౌజ్​లో దర్శనమిచ్చారు. సాధారణంగా వైట్​ టీషర్ట్​, ట్రౌజర్​లో కనిపించే రాహుల్​గాంధీ అపొజిషన్​ లీడర్​ హోదా దక్కడంతో కొత్త అవతారంలో పార్లమెంట్​లో అడుగుపెట్టారు. లోక్​సభ స్పీకర్​గా ఎన్నికైన ఓంబిర్లాను ప్రధాని నరేంద్రమోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్​ రిజిజుతో కలిసి సీటు వద్దకు తీసుకెళ్లి, కూర్చోబెట్టారు. తనను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నాకు మద్దతు, శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్​అధ్యక్షుడు ఖర్గే, దేశంలోని పార్టీ నేతలు, బబ్బర్​షేర్​ కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. ప్రతి భారతీయుడి గొంతును నేను పార్లమెంట్​లో వినిపిస్తా. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా. ఎన్డీయే సర్కారు ప్రజలకు జవాబుదారీగా పనిచేసేలా చూస్తా” అని రాహుల్​గాంధీ పేర్కొన్నారు.

గాంధీ కుటుంబం నుంచి రాహుల్​ మూడో ప్రతిపక్ష నేత

54 ఏండ్ల రాహుల్.. గాంధీల కుటుంబం నుంచి లోక్​సభలో మూడో ప్రతిపక్షనేత. రాహుల్​ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ1989–90 వరకు వీపీ సింగ్​ ప్రభుత్వంలో అపొజిషన్​లీడర్​గా ఉన్నారు. అలాగే, రాహుల్​ తల్లి, యూపీఏ చైర్​పర్సన్​ సోనియాగాంధీ 1999–2004 వరకు ఏబీ వాజ్​పేయి సర్కారులో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2014, 2019లో కాంగ్రెస్​కు సరిపోయే సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. కానీ ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలతో దిగువ సభలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రతిపక్ష హోదాకు సరిపోయేంత సీట్లు రావడంతో ఎల్​ఓపీగా రాహుల్​ను ఎన్నుకున్నారు.