పేదల అకౌంట్లలో రూ.3.6లక్షలు వేస్తాం: రాహుల్

పేదల అకౌంట్లలో రూ.3.6లక్షలు వేస్తాం: రాహుల్
  • ఏటా రూ.72వేలు పేదల అకౌంట్లలో వేస్తాం
  • ఐదేళ్లలో రూ.3.6లక్షలు జమచేస్తాం
  • నరేంద్రమోడీ ఫ్రెండ్స్ నుంచి ఫండ్స్ వసూలు చేస్తాం
  • మోడీ 100కు వంద శాతం చౌకీదార్ కాదు.. ఓ దొంగ
  • కోలార్ లో రాహుల్ గాంధీ కామెంట్స్

ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడికి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్ లో నిర్వహించిన  ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. తాము మేనిఫోస్టోలో ప్రకటించిన న్యూనతమ్ ఆయ్ యోజన(న్యాయ్) పథకాన్ని చూసి  ప్రధాని మోహం వాడిపోయిందని అన్నారు. ఈ పథకం అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారన్నారని చెప్పిన రాహుల్.. అందుకు వివరణ ఇచ్చారు. ఈ పథకానికి అవసరమైన డబ్బులు… మోడీ  స్నేహితుడు అనిల్ అంబానీ నుంచి వసూలు చేస్తామని రాహుల్  చురకలంటించారు. దేశ ప్రజల సొత్తు రూ.30వేల కోట్లను .. తన స్నేహితులకు దోచిపెట్టారని విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. దేశంలోని ప్రతీ పేద కుటుంబానికి చెందిన బ్యాంకు ఖాతాలలో సంవత్సరానికి రూ.72,000 చొప్పున డిపాజిట్ చేస్తామని రాహుల్ ప్రకటించారు. పేదలకు రూ. 15 లక్షలు ఇస్తానని మోడీ తప్పుడు వాగ్దానాలు చేశారనీ..  తాము అలా కాదన్నారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రతీ పేద కుటుంబంలోని బ్యాంకు ఖాతాల్లో న్యాయ్ స్కీమ్ కింద తమ పార్టీ రూ. 3.60 లక్షలు వేస్తుందని, ఆ నగదు కుటుంబంలోని మహిళల బ్యాంకు ఖాతాల్లోకి వెళుతుందని రాహుల్ చెప్పారు.