కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్‌‌!

కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్‌‌!
  • ఆర్జేడీ లీడర్ తేజస్వీ సంకేతాలు 
  • వచ్చే ఎన్నికల్లో రాహుల్‌‌ను  ప్రధానిని చేస్తామని వెల్లడి 

నవాడా(బిహార్​): వచ్చేలోక్‌‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్‌‌ గాంధీనే అని ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ సంకేతాలు ఇచ్చారు. ‘‘వచ్చేసారి రాహుల్‌‌ను ప్రధానిని చేస్తాం. అందుకోసం ప్రతిపక్ష కూటమి కృషి చేస్తుంది” అని తెలిపారు. రాహుల్ తన పక్కన ఉన్న టైమ్‌‌లోనే ఈ వ్యాఖ్యలు చేశారు.

 గత లోక్‌‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తేజస్వీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం బిహార్‌‌‌‌లోని నవాడాలో ఓటర్ అధికార్ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. బీజేపీ, ఈసీ కుమ్మక్కయి ఓట్లను దొంగిలించాలని, బిహార్ ప్రజలను ఫూల్ చేయాలని చూస్తున్నాయని ఫైర్ అయ్యారు. ‘‘మా ఓటు హక్కును లాక్కోవాలని బీజేపీ చూస్తున్నది. మేం బిహారీలం.. బిహారీ అందరికంటే గొప్పవాడు. మేం ఎన్నికలను ఖైనీ (తంబాకు) లెక్క రుద్ది అవతల పారేస్తాం” అని అన్నారు. 

‘‘బిహార్‌‌‌‌లో ఓట్లను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. అందులో భాగంగానే ఈసీ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టింది. బీజేపీతో కుమ్మక్కయి బతికి ఉన్నోళ్ల ఓట్లను కూడా తొలగిస్తున్నది. 65 లక్షల మందికి పైగా ఓటర్లను జాబితా నుంచి తీసేసింది. బీజేపీ ‘సర్’ ద్వారా ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నది. 

దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటం” అని చెప్పారు. వయసైపోయిన, బలహీనమైన ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సీఎం నితీశ్ కుమార్‌‌‌‌ను ఉద్దేశించి అన్నారు.