నవంబర్14 న గిగ్ వర్కర్లతో.. రాహుల్ గాంధీ ర్యాలీ

నవంబర్14 న గిగ్ వర్కర్లతో.. రాహుల్ గాంధీ ర్యాలీ
  • శిల్పకళావేదిక  నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీసీ వరకు
  • అదే రోజు గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఆవిష్కరణ
  • రిజిస్ట్రేషన్, ప్రమాద బీమా, సంక్షేమ బోర్డు
  • సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు వివేక్, పొన్నం
  • గిగ్ కార్మికులతో కలిసి మంత్రి వివేక్ భోజనం 

హైదరాబాద్, వెలుగు: గిగ్, ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రతే లక్ష్యంగా  నవంబర్ 14న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ ర్యాలీ, బహిరంగ సభ జరగనుంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో మాదాపూర్ శిల్పకళావేదిక నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీసీ వరకు ర్యాలీ సాగనుంది. 

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై వేలాది మంది కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొని, వారితో ముఖాముఖి మాట్లాడనున్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీసీ పక్కన జయభేరి–మీనాక్షి టవర్స్ సమీపంలోని సభా స్థలాన్ని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.  

వేదిక, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, భోజన వసతులపై అధికారులకు సూచనలు చేశారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో భద్రతా లోపాలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, కార్మికులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అమల్లోకి గిగ్ వర్కర్ల చట్టం

భారత్ జోడో యాత్ర, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌‌‌ఫామ్ వర్కర్స్ యాక్ట్–2026’ను, సంక్షేమ పథకాలను ఈ సభా వేదికపై రాహుల్ అధికారికంగా ప్రారంభించనున్నారు. 

ఈ చట్టంతో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, డిజిటల్ సేవల కార్మికులకు తప్పనిసరి రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, ప్రమాద బీమా, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ చట్టబద్ధమవుతాయి. ప్రత్యేక సంక్షేమ బోర్డుతో పాటు కార్మికుల నమోదు, ఫిర్యాదుల కోసం రూపొందించిన మొబైల్ యాప్‌‌‌‌ను కూడా ఆవిష్కరిస్తారు. 

ప్రభుత్వ నిర్ణయాలపై టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గిగ్ కార్మికుడికి గౌరవం, సామాజిక భద్రత కల్పించడమే తమ ఉద్యమ లక్ష్యమన్నారు.

కార్మికులతో మంత్రి భోజనం

కొండాపూర్‌‌‌‌లో గిగ్ కార్మికులతో సమావేశమైన మంత్రి వివేక్, వారితో కలిసి భోజనం చేసి పని పరిస్థితులు తెలుసుకున్నారు. తీవ్రమైన పని ఒత్తిడి, సంస్థల అల్గారిథమ్ ఆధారిత కోతలు, ప్రమాదాలు, ఆరోగ్య భద్రత లేకపోవడం వంటి సమస్యలను కార్మికులు ఆయన దృష్టికి తెచ్చారు. గిగ్ కార్మికుల హక్కుల పరిరక్షణకు, వారి కుటుంబాల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసాగా ఉంటుందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రతినిధులు సయ్యద్ అబ్దుల్ రవూఫ్, సతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.