మోడీ వైపరీత్యాలతో తిరోగమనంలో ఇండియా: రాహుల్

మోడీ వైపరీత్యాలతో తిరోగమనంలో ఇండియా: రాహుల్

న్యూఢిల్లీ: మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు ప్రధానిపై మండిపడ్డారు. కరోనా కారణంగా జీడీపీ రికార్డు స్థాయిలో పడిపోవడం, పాంగాంగ్ లేక్ వద్ద యథాతథ స్థితిని భంగపరచడానికి చైనా యత్నించిన విషయాల ఆధారంగా మోడీపై రాహుల్ ఫైర్ అయ్యారు. మోడీ స్వయం నిర్మిత వైపరీత్యాలు దేశంపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. జీడీపీ తగ్గుదలను యాక్ట్ ఆఫ్ గాడ్ గా అభివర్ణించిన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పై మనుషుల చర్యలకు దేవుడిపై అపవాదు వేస్తారా అంటూ మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాల ప్రాతిపదికన మోడీ సర్కార్ పై రాహుల్ బుధవారం కామెంట్స్ చేశారు.

‘మోడీ స్వయంగా తయారు చేసిన వైపరీత్యాల కారణంగా ఇండియా తిరోగమనంలో పయనిస్తోంది. చారిత్రక జీడీపీ 23.9 శాతం తగ్గుదల, 12 కోట్ల మందికి ఉపాది లేకపోవడమనేది గత 45 ఏళ్లలో అత్యధిక మొత్తంలో నిరుద్యోగికతగా చెప్పొచ్చు. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్రం చెల్లించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు పెరుగుతున్న కరో్నా కేసులు, మరణాల్లో మనమే ముందున్నాం. సరిహద్దుల్లో ఇతర దేశాల దూకుడు‘ అని రాహుల్ ట్వీట్ చేశారు.