
- పహల్గాం నిందితులను కఠినంగా శిక్షించాలి
- హర్యానాలో నేవీ ఆఫీసర్ ఫ్యామిలీకి పరామర్శ
- వినయ్ నర్వాల్ భార్య, తల్లిదండ్రులకు ఓదార్పు
హర్యానా: ఇండియా వైపు మళ్లీ ఎవరూ కన్నెత్తి చూడకుండా పహల్గాం దోషులను శిక్షించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం విషయంలో కేంద్రానికి ప్రతిపక్షం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఫ్యామిలీని రాహుల్ గాంధీ మంగళవారం పరామర్శించారు. హర్యానాలోని నర్వాల్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వినయ్ నర్వాల్.. తన భార్య హిమాన్షితో హనీమూన్‌లో ఉండగా ఉగ్రదాడిలో అమరుడు అయ్యాడు.
వినయ్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదు. అతని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో పాటు దేశం మొత్తం అండగా ఉంటది. టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలి. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ప్రతిపక్షం పూర్తి మద్దతు ఇస్తుంది. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి టూరిస్ట్ ఫ్యామిలీకి న్యాయం చేయాలి. వినయ్ నర్వాల్‌తో పాటు ఇతర బాధితుల కుటుంబాలకు నా పూర్తి సహకారం ఉంటది’’అని రాహుల్ అన్నారు. సుమారు గంటన్నర పాటు నర్వాల్ ఫ్యామిలీని రాహుల్ పరామర్శించారు. వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి, తండ్రి రాజేశ్ నర్వాల్‌తో రాహుల్ మాట్లాడారు.