మే 29 నుంచి అమెరికాలో రాహుల్‌ గాంధీ పర్యటన

మే 29 నుంచి అమెరికాలో రాహుల్‌ గాంధీ పర్యటన

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు రాహుల్‌ గాంధీ సోమవారం (మే 29వ తేదీ) నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల గడువుతో కూడిన ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ ఆయనకు మంజూరైంది. దీనికి సంబంధించిన నిరభ్యంతర సర్టిఫికేట్‌ను ఢిల్లీ కోర్టు శుక్రవారం ఇచ్చింది. దీంతో పదేళ్ల గడువుతో కూడిన ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ బదులుగా మూడేళ్ల కాలానికి పని చేసే తాత్కాలిక ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ను రాహుల్‌ గాంధీకి ఇచ్చారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేసినందుకు గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించడంతోపాటు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రాహుల్‌ గాంధీ కోల్పోయారు. దీంతో దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేశారు. పదేళ్ల గడువుతో కూడిన సాధారణ పాస్‌పోర్ట్‌ కోసం ఆయన దరఖాస్తు చేశారు. అయితే నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ ఎదుర్కొంటున్న రాహుల్‌ గాంధీకి పదేళ్ల కాల పరిమితి ఉండే ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ మంజూరుపై సుబ్రమణ్యస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఒక ఏడాది కాలానికే పాస్‌పోర్ట్‌ మంజూరు చేయాలని, అవసరం మేరకు దానిని మరో ఏడాదికి పొడిగించాలని ఢిల్లీ కోర్టును కోరారు. అయితే పదేళ్ల ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ కోసం రాహుల్‌ గాంధీ తరుఫు న్యాయవాదులు కోర్టులో పట్టుబట్టారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు మూడేళ్ల గడువుతో కూడిన ఆర్డినరీ పాస్‌పోర్ట్‌పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో తాత్కాలిక పాస్‌పోర్ట్‌ ఆయనకు లభించింది.

మరోవైపు రాహుల్‌ సోమవారం నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో జరగనున్న సమావేశాలకు ఆయన హాజరవుతారు. ఆయా నగరాల్లోని యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడనున్నారు. భారతీయ అమెరికన్లను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు.