ట్రంప్‌‌‌‌‌‌‌‌ సుంకాలపై మోదీ తలొగ్గుతరు.. నా మాట రాసిపెట్టుకోండి: రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ

ట్రంప్‌‌‌‌‌‌‌‌ సుంకాలపై మోదీ తలొగ్గుతరు.. నా మాట రాసిపెట్టుకోండి: రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ

న్యూఢిల్లీ:  అమెరికాతో ట్రేడ్‌‌ డీల్‌‌ విషయంలో ఆలస్యం చేస్తున్న భారత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌‌ గాంధీ ఫైర్‌‌‌‌ అయ్యారు. 26 శాతం సుంకాల విధింపు విషయంలో అమెరికా విధించిన 90 రోజుల గడువు జులై 9తో ముగియనుండటంపై ఆయన శనివారం ‘ఎక్స్‌‌’లో స్పందించారు. ‘‘ట్రంప్‌‌ సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారు. నా మాటలు నమ్మకపోతే రాసిపెట్టుకోండి.. ఈ విషయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌‌  గోయల్‌‌ గుండెలు బాదుకోవడం తప్ప.. చేసేదేమీ లేదు”అని రాహుల్‌‌ పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఓ కార్యక్రమంలో పీయూష్‌‌ గోయల్‌‌ మాట్లాడుతూ.. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై ఇండియా ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉంటేనే ట్రేడ్ డీల్‌‌కు భారత్‌‌ అంగీకరిస్తుందన్నారు. 

డెడ్‌‌ లైన్‌‌ విధించి వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసేందుకు దేశం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, మొక్కజొన్న, సోయాబీన్స్‌‌ వంటి అమెరికన్‌‌ వ్యవసాయ దిగుమతులపై సుంకాలు తగ్గించకపోతే ఇండియాలో పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా  కుదుర్చుకోనున్న ఒప్పందంలో భారత్‌‌ కొన్ని రంగాల్లో సుంకాల నుంచి సడలింపు కోరుతోంది. టెక్స్ టైల్స్‌‌, డైమెండ్స్‌‌, జువెలరీ, లెదర్‌‌‌‌ గూడ్స్‌‌, కెమికల్స్‌‌, రొయ్యలు, నూనె గింజలు తదితరాలు ఇందులో ఉన్నాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారత్‌‌, అమెరికా అధికారుల మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయి. ట్రంప్ విధించిన పరస్పర సుంకాలపై 90 రోజుల సస్పెన్షన్ గడువు ఈ నెల 9తో ముగియనుంది. అప్పటివరకు ఇరు దేశాల మధ్య ట్రేడ్‌‌ డీల్‌‌ను ముగించే విషయంపై ఇండియా పనిచేస్తోంది. ఒకవేళ ఎలాంటి ఒప్పందం కుదరకపోతే భారత్‌‌పై ట్రంప్‌‌ ప్రతీకార సుంకాలను విధించే అవకాశం ఉంది.