రాహుల్ తలకు గురి? : హోంశాఖ క్లారిటీ

రాహుల్ తలకు గురి? : హోంశాఖ క్లారిటీ

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై స్పందించింది కేంద్ర హోంశాఖ. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. రాహుల్ గాంధీకి అవసరమైన భద్రత ఉందని ఓ ప్రకటనలో తెలిపింది . మీడియాతో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ తలపై పడిన పచ్చరంగు లేజర్ లైట్… ఎవరో గురిపెట్టి గన్ తో కాల్చేందుకు సిద్ధపడింది కాదని వివరణ ఇచ్చింది.

అమేథీలో నామినేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతుండగా… ఓ అనుమానాస్పద సంఘటన జరిగింది. రాహుల్ గాంధీ తలపై ఏడుసార్లు పచ్చరంగు లేజర్ లైట్ పడింది. ఇది కొన్ని కెమెరాల్లో రికార్డైంది. రాహుల్ గాంధీకి ఎవరైనా స్నైపర్ రైఫిల్ తో అపాయం తలపెట్టారా అని కాంగ్రెస్ నాయకులు అనుమానపడ్డారు. పార్టీ సీనియర్ నేతలు జైరామ్ రమేష్, అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సుర్జేవాలాలు కేంద్ర హోంశాఖకు ఓ లెటర్ రాశారు. రాహుల్ గాంధీకి ఇస్తున్న సెక్యూరిటీలో లోపాలున్నాయనీ.. ఆ లైట్ కు కారణాలేంటో చెప్పాలని కోరారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను కూడా తీవ్రవాదులు హత్య చేశారనీ.. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని తమ ఆందోళనను కేంద్రానికి తెలియజేశారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి రాహుల్ భద్రతపై చర్యలు తీసుకోవాలన్నారు.

దీనిపై  కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. రాహుల్ గాంధీ సెక్యూరిటీ అంశంపై తమకు కాంగ్రెస్ నుంచి ఎటువంటి లెటర్ అందలేదని చెప్పింది. ఐతే… రాహుల్ గాంధీ భద్రతపై వచ్చిన అనుమానాలను తొలగించే బాధ్యత తీసుకున్నామని తెలిపింది. తలపై కనిపించిన గ్రీన్ లేజర్ లైట్ పై ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులకు భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ డైరెక్టర్ (SPG) అధికారుల నుంచి వివరణ తెప్పించుకుంది. ఆ గ్రీన్ లైట్ ఓ ఏఐసీసీ ఫొటో గ్రాఫర్‌కు చెందిన సెల్ ఫోన్ నుంచి వచ్చిన లైట్ అని నిర్ధారించింది. ఈ వివరాలను రాహుల్ గాంధీ ఆఫీస్ కు కూడా పంపించామని కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది.