బిహార్లో ‘సర్’ అసలు రంగు బయటపెడ్తం..బీజేపీ, ఈసీ కలిసి ఓట్ల దోపిడీకి పాల్పడ్తున్నయ్: రాహుల్ గాంధీ

బిహార్లో ‘సర్’ అసలు రంగు బయటపెడ్తం..బీజేపీ, ఈసీ కలిసి ఓట్ల దోపిడీకి పాల్పడ్తున్నయ్: రాహుల్ గాంధీ
  • ఓట్ చోరీ కుట్రలను అడ్డుకుంటం
  • బీజేపీ, ఈసీ కలిసి ఓట్ల దోపిడీకి పాల్పడ్తున్నయ్​ : రాహుల్
  • బిహార్​లో ‘సర్’ అసలు రంగు బయటపెడ్తం
  • రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా పోరాటం
  • బిహార్​లో ‘‘ఓటర్‌‌ అధికార్‌‌ యాత్ర’’ ప్రారంభం
  • దేశానికి బీజేపీ ఎంతో ప్రమాదకరం: ఖర్గే

సాసారామ్: బీజేపీతో కలిసి ఎన్నికల కమిషన్ ఓట్లు చోరీ చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. లోక్‌‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీకి గురవుతున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లోనూ అన్ని రాష్ట్రాల్లో ఈ చోరీ జరిగిందని ఆరోపించారు. ఇక నుంచి ఏ రాష్ట్రంలో కూడా ఓట్లు చోరీ కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బిహార్‌‌ రోహ్‌‌తాస్ జిల్లా సాసారం సిటీలో ఆదివారం ‘‘ఓటర్‌‌ అధికార్‌‌ యాత్ర’’ ప్రారంభోత్సవంలో రాహుల్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ పేరిట బిహార్‌‌లో ఓట్ల తొలగింపు, చేర్పుల వంటి కుట్రలకు తెరలేపారు. పేదల ఓటు అధికారాన్ని వారి నుంచి ఇండియా కూటమి దూరం కానివ్వదు. బిహార్​లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఈసీతో కలిసి బీజేపీ కుట్రలకు తెరలేపింది. దేశ సంపదను సంపన్నులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. బిహార్‌‌లో చేస్తున్న ‘సర్’ అసలు రంగు బయటపెడ్తాం. ఓట్ల చోరీని అడ్డుకోవడంలో ఇండియా కూటమి విజయం సాధిస్తది’’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.

రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఎన్డీయేతో పోరాడుతున్నట్లు రాహుల్ తెలిపారు. ‘‘ఓట్లు ఎలా చోరీ అయ్యాయో కొన్ని రోజుల కిందే నేను దేశ ప్రజలకు వివరించాను. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. అన్ని ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తున్నది. ఇది ఎలా సాధ్యం? మహారాష్ట్రలో లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాదే విజయమనే అంచనాలు వెలువడ్డాయి. కానీ, 4 నెలల్లోనే కోటి మంది ఓటర్లు వచ్చి చేరడంతో.. బీజేపీ కూటమి గెలిచింది. ఎక్కడైతే ఓట్లు పెరిగాయో.. అక్కడ బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్​లో లక్షకు పైగా ఓట్లు చోరీకి గురయ్యాయి. బీజేపీ లీడర్లు ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌ పెడితే ఈసీ అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ అడగలేదు. నేను ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌ పెడితే అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ అడుగుతున్నది. ఓటర్ల డేటాను అడిగినా ఈసీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగానే కుల గణనకు మోదీ ప్రభుత్వం ఒప్పుకున్నది. చేసే కుల గణన కూడా నిజాయితీగా చేయదు’’అని రాహుల్ విమర్శించారు.

బిహార్​లో ఎన్డీయే సర్కార్​ను గద్దె దించుతాం: లాలూ ప్రసాద్ యాదవ్

‘‘ఓటర్‌‌‌‌‌‌‌‌ అధికార్‌‌‌‌‌‌‌‌ యాత్ర’’ కేవలం ఓ పొలిటికల్ మార్చ్ కాదని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటం అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. ‘‘దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ చేపట్టారు. ఇప్పుడు ఓటు హక్కు కాపాడేందుకు ఓటర్ అధికార్ యాత్ర చేపడ్తున్నరు’’అని జైరాం రమేశ్ అన్నారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతున్నదని మండిపడ్డారు. బిహార్​లో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని.. ఇండియా కూటమి గద్దె దించుతుందని ఆర్జేడీ ప్రెసిడెంట్ లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడి.. ప్రజలందరికీ ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు.  ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకు ఎన్నికల సంఘాన్ని బీజేపీ వాడుకుంటున్నదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును.. బీజేపీ లాక్కుంటున్నదని మండిపడ్డారు.

రాజ్యాంగం ప్రమాదంలో ఉంది: ఖర్గే

రాజ్యాంగం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశానికి ఎంతో ప్రమాదకరమైన మోదీ ప్రభుత్వానికి.. ఎన్నికల కమిషన్ ఓ ఏజెంట్ మాదిరి వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈసీ వ్యవహారశైలి రాజ్యాంగానికి ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. ఓటు హక్కును లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని, దీన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ‘‘కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉంది. బిహార్‌‌‌‌‌‌‌‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే ఎన్డీయే సర్కార్​ను గద్దె దించుతారు. మహారాష్ట్రలో లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య టైమ్​లో కోటి మంది ఓటర్లను చేర్చారు. బిహార్​లోనూ ‘సర్’ పేరుతో అదే చేస్తున్నరు. ఈసీ మాత్రం ఏం చేయడం లేదు’’అని ఖర్గే విమర్శించారు.

16 రోజులు.. 20 జిల్లాలు.. 1,300కుపైగా కిలో మీటర్లు

బిహార్​లో ఆదివారం ప్రారంభమైన ‘ఓటర్ అధికార్ యాత్ర’.. 16 రోజుల పాటు సాగనున్నది. మొత్తం 20 జిల్లాలను కవర్ చేస్తూ.. 1,300 కిలో మీటర్లకు పైగా హైబ్రిడ్ మోడ్ లో యాత్ర ఉంటుంది. రాహుల్ గాంధీ.. కొద్దిగా నడుస్తూ.. కొద్దిగా వెహికల్​పై యాత్రలో పాల్గొంటారు. ఔరంగాబాద్, గయా, నవాడా, నలంద, షేక్​పురా, లఖిసరాయి, ముంగర్, భగల్​పూర్, కటియార్, పూర్ణియా, అరారియా, సుపౌల్, మధుబని, దర్బంగా, సితామర్హి, ఈస్ట్ చంపారన్, వెస్ట్ చంపారన్, గోపాల్​గంజ్, సివాన్, చప్రా, ఆరా మీదుగా యాత్ర కొనసాగుతుంది. సెప్టెంబర్ 1న పాట్నలోని గాంధీ మైదాన్​లో నిర్వహించే భారీ బహిరంగ సభతో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగుస్తుంది.