సీజ్​ఫైర్​ను తొలుత ట్రంప్ ఎలా ప్రకటిస్తారు?

సీజ్​ఫైర్​ను తొలుత ట్రంప్ ఎలా ప్రకటిస్తారు?
  • ప్రధాని మోదీని ప్రశ్నించిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 
  • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని లేఖ
  • ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై చర్చించాలని విజ్ఞప్తి
  • అపొజిషన్ పార్టీల తరఫున రిక్వెస్ట్  చేస్తున్నానని వెల్లడి
  • రాహుల్  లేఖను సమర్థిస్తూ ప్రధానికి మరో లేఖ రాసిన ఖర్గే

న్యూఢిల్లీ, వెలుగు: పహల్గాం టెర్రర్  దాడి, ఆపరేషన్  సిందూర్  తర్వాత భారత్ – పాకిస్తాన్  మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు దేశ భద్రతపై చర్చించేందుకు వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని కేంద్ర  ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్  చేశాయి. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్  గాంధీ ఆదివారం లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్  సిందూర్,  కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  తొలుత ప్రకటించడం పై పార్లమెంటులో చర్చించాలని రాహుల్  తన లేఖలో విజ్ఞప్తి   చేశారు. సీజ్​ఫైర్ ను ట్రంప్  ముందుగా ఎలా ప్రకటించారని ఆయన నిలదీశారు. 

రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి దేశ సంకల్పాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశమన్నారు. పార్లమెంటు ప్రత్యేక  సమావేశాల నిర్వహణ డిమాండ్‌‌‌‌‌‌‌‌పై ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అలాగే, రాహుల్  లేఖను సమర్థిస్తూ రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్  చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా మోదీకి ప్రత్యేకంగా ఓ లెటర్  రాశారు. పహల్గాం టెర్రర్  అటాక్  నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గత నెల 28న లేఖ రాశామని ఖర్గే గుర్తుచేశారు. తాజా పరిణామాల దృష్ట్యా పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా తాను ఈ అభ్యర్థన చేస్తున్నానని ఆయన తెలిపారు.

మోదీ హాజరైతేనే మనం హాజరవ్వాలి: సిబల్

పహల్గాం టెర్రర్  అటాక్, ఆపరేషన్  సిందూర్, కాల్పుల విరమణ ఒప్పందంపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు కపిల్  సిబల్  డిమాండ్  చేశారు. అయితే, ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుపై ఇంకా స్పష్టత రాలేదని, ప్రధాని హాజరైతేనే ప్రతిపక్ష నేతలు హాజరు కావాలని ఆయన కోరారు. మాజీ ప్రధాని మన్మోహన్  సింగ్  ప్రధానిగా ఉండుంటే, ఈపాటికే అఖిలపక్ష సమావేశం నిర్వహించే వారని, ఆయన కూడా భేటీకి హాజరయ్యేవారని సిబల్  వ్యాఖ్యానించారు. పహల్గాం టెర్రర్  అటాక్  తర్వాత నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ గైర్హాజరుకావడం తనకు నచ్చలేదన్నారు.

యూఎస్ మధ్యవర్తిత్వంపై కేంద్రం నోరు విప్పాలి: సచిన్ పైలట్

కాశ్మీర్  సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నదని, ఈ ప్రయత్నాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్  సీనియర్  నేత సచిన్ పైలట్ అన్నారు. అమెరికా మధ్యవర్తిత్వంపై కేంద్రం తన వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐసీసీ హెడ్ ఆఫీసులో పైలట్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాశ్మీర్  సమస్య భారత్–పాక్  దేశాల మధ్య అని, కాశ్మీర్  భారత్​లో అంతర్భాగమని బీజేపీ నేతలు ఇదివరకే ఎన్నోసార్లు చెప్పారు. మరి మూడో దేశమైన అమెరికా మధ్యవర్తిత్వాన్ని మోదీ సర్కారు ఎలా అంగీకరించింది. భారత్– పాక్  తటస్థ వేదికపై సమావేశం అవుతాయని అమెరికా అధికారులు ప్రకటించడం ఏంది? ఇది కాశ్మీర్  సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చే ప్రయత్నమే” అని పైలట్  వ్యాఖ్యానించారు.

 ఆపరేషన్  సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ వెనుక ఉన్న షరతులు ఏంటో దేశ ప్రజలకు మోదీ సర్కారు చెప్పాలని ఆయన డిమాండ్  చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకోవాలని 1994లో పార్లమెంటులో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని గుర్తుచేశారు. ఈ తీర్మానానికి ప్రస్తుత పార్లమెంటులోని ప్రతి సభ్యుడు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.