బస్తీ పిలగాడి పాట.. వివాదాల నుంచి ఆస్కార్ విజయం వరకు

బస్తీ పిలగాడి పాట.. వివాదాల నుంచి ఆస్కార్ విజయం వరకు

అప్పుడు అతనికి తెలియదు.. నాన్నకు తెలియకుండా తీసిన కూని రాగాలు ఆస్కార్ స్టేజ్ వరకు తీసుకొస్తాయని. నలుగురి ముందు పాడాలంటే భయ పడ్డవాన్ని ప్రపంచ మెచ్చిన వేదికపై నిలబెడతాయని. ధూల్ పేట్ గల్లీల్లో తీసిన పరుగులు ఆస్కార్ వైపు తీసుకెళ్తాయని. గిన్నెలు, గరిటెలు వాయించుకుంటూ వేసిన స్టెప్పులే ఆస్కార్ స్టేజ్ పై వేసేలా చేస్తాయని. వివాదాల్లో ఇరుకున్న పేరు ఆస్కార్ స్క్రీన్ పై కనిపిస్తుందని. అమెరికా వెళ్లి గొప్ప వాడిలా తిరిగిరావాలన్న వాళ్ల నాన్న మాట ఒక్క పాటతో నిజమవుతుందని. ఆ పేరు రాహుల్ సిప్లిగంజ్.

రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్ లోని పాతబస్తీలో 1989 ఆగస్టు 22న జన్మించాడు. చిన్నప్పటినుంచే సంగీతంపైన ఇంట్రెస్ట్ ఉండేది. కానీ, తన తండ్రి  రాజ్ కుమార్ ముందు పాడాలన్నా, స్టేజ్ పై నిల్చోవాలన్నా భయపడేవాడు. స్కూల్ నుంచి రాగానే కూని రాగాలు తీస్తూ బల్లలు, గిన్నెలపై దరువులు వేస్తూ పాటలు పాడేవాడు. పాటలపై రాహుల్ ఇంట్రెస్టు చూసినవాళ్ల నాన్న ఆయనకు తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతం శిక్షణ ఇప్పించాడు. సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి సాయంగా వాళ్ల బార్బర్ షాపులో పనిచేసేవాడు. దాదాపు 7 సంవత్సరాలు కోచింగ్ తీసుకున్న తర్వాత గజల్స్ లో పట్టు సాధించాడు. 

డబ్బింగ్ సినిమాలకు పాడి

ఇంటర్ చదువుతున్న టైంలో కోరస్ సింగర్ గా పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. వాటి తర్వాత సినిమాల్లో ట్రై చేయడం మొదలుపెట్టాడు. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ వాళ్ల డబ్బింగ్‌ సినిమాలకు తెలుగులో పాడేవాడు. సంగీత దర్శకుల వద్ద కోరస్‌, బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా పాటలు పాడేవాడు. 2013 నుంచి ఒక్కోపాటకు మూడు లక్షలు ఖర్చు పెట్టి వీడియో ఆల్బమ్స్ చేయడం మొదలుపెట్టాడు. స్పాన్సర్స్ దొరకకపోయే సరికి డబ్బు కోసం రాహుల్ నాన్న రాజ్ కుమార్ నగలు అమ్మి సాయం చేశాడు. తల్లిదండ్రుల కష్టం వృధా కాకూడదని రాత్రీపగలు కష్టపడుతూ పాటలు రాస్తూ.. తీస్తూ.. ఎడిట్ చేస్తూ కష్టపడేవాడు. రాహుల్ రాసిన పాటలు తెలంగాణ యాసలో ఉండటంవల్ల జనాల్లో బాగా క్లిక్ అయ్యాయి. 

‘జోష్’గా మొదలుపెట్టి

అప్పుడే తొలిసారిగా నాగచైతన్య సినిమా జోష్ లో కాలేజీ బుల్లోడా అనే పాట పాడే చాన్స్ వచ్చింది. ఆ పాటకు అందరి దగ్గరనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో అతను చేసిన పాటలన్నీ సీడీ చేసి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి చూపించాడు. రాహుల్ ప్రతిభను గుర్తించిన కీరవాణి దమ్ము సినిమాలో వాస్తు బాగుందే పాట పాడించాడు. తర్వాత ఈగలో ఈగ ఈగ, రచ్చలో సింగరేణి ఉంది..., రంగస్థలంలో రంగా రంగా రంగస్థలాన, ఇస్మార్ట్ శంకర్ లో బోనాలు ఇలా పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 2019లో తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొనడంతో రాహుల్‌ దశ తిరిగింది. ఆ సీజన్‌ విన్నర్‌గా బయటకు వచ్చి తన జర్నీని మరింత ముందుకు తీసుకెళ్లింది. 

సస్పెన్స్ గా పాడించారు

నాటు నాటు పాటకోసం కీరవాణి.. రాహుల్ ని సెలక్ట్ చేశాడట. కీరవాణి ప్రోత్సాహంతోనే ఆ పాట పాడాడట. ‘నాటు నాటు పాటకోసం నన్ను పిలిచి ఇద్దరు టాప్ హీరోలకు పాట పాడాలి. ఇప్పుడు నువ్వు పాడబోయేది ఫైనల్ కాదు. నచ్చితేనే సినిమాలో ఉంటుంద’ని కీరవాణి చెప్పాడట. అంతేగాని ఆ పాట ఆర్ఆర్ఆర్ కోసమని అందులో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్  అని తెలియలేదు రాహుల్ కి. తర్వాత మళ్లీ పిలిపించి తమిళం, కన్నడ, హిందీలోనూ పాడించారు. ఆ ట్యూన్ ఫైనల్ చేసి సినిమాలో పెట్టారు.

కాంట్రవర్సీలకు కేరాఫ్

రాహుల్ పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన కొన్నిరోజులకే ఓ పబ్ లో జరిగిన గొడవలో రాహుల్ బీరు బాటిల్ తో ఓ వ్యక్తి తల పగలగొట్టాడు. అప్పుడు అది హాట్ టాపిక్ అయింది. తర్వాత కొన్నాళ్లకు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదురుకున్న రాహుల్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. ఇలా వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన రాహుల్ తనను విమర్శించిన వాళ్లతోనే చప్పట్లు కొట్టించుకున్నాడు. విశ్వ వేదికపై సగర్వంగా నిలబడ్డాడు. దీంతో బస్తీ పోరడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది.