ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేల్చుతం:రాహుల్ గాంధీ

ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేల్చుతం:రాహుల్ గాంధీ
  • దాంతో మోదీ ప్రజలకు ముఖం చూపించలేడు: రాహుల్ గాంధీ
  • చైనా, అమెరికాలోను ఓట్​చోర్​నినాదం వినిపిస్తోంది
  • ఓట్ చోరీతో ప్రజాస్వామ్యం, హక్కులు, భవిష్యత్తు దోపిడీ
  • బిహార్‌‌‌‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో వ్యాఖ్యలు 
  • ‘గాంధీ సే అంబేద్కర్ మార్చ్’ నిర్వహించిన ఇండియా కూటమి

పాట్నా: ఓట్ల చోరీ వ్యవహారంలో తాము ఇప్పటికే అణుబాంబు పేల్చామని, ఇక త్వరలోనే హైడ్రోజన్ బాంబు సిద్ధం చేసి పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. దీంతో ప్రధాని మోదీ ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని, ఆయన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారని అన్నారు. బిహార్‌‌‌‌లోని పట్నాలో ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ ముగింపు సభలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని, వాళ్లను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఈ యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, మహారాష్ట్ర, కర్నాటకలో ఓట్ల చోరీ జరిగినట్లు ఆధారాలతో సహా చూపించామని తెలిపారు. ఓట్ల చోరీ అంటే ఓటు మాత్రమే కాదు, హక్కులు, ప్రజాస్వామ్యం, ఉపాధి చోరీ అని వివరించారు. ఓటు చోరీతో యువత రిజర్వేషన్లు, విద్య, భవిష్యత్తు కూడా దోచుకుంటారని.. అదానీ, అంబానీలకు అప్పగిస్తారని ఆరోపించారు.

మహారాష్ట్రలో ఎన్నికల ముందు కోటి ఓట్లు చేర్చారు

ఈ యాత్ర ముగింపు సందర్భంగా ‘గాంధీ సే అంబేద్కర్’​ మార్చ్ నిర్వహించారు. ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. అయితే పోలీసులు మార్చ్ ను మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ మోదీ చైనా పర్యటనపై కూడా విమర్శలు గుప్పించారు. ‘‘ఓటు చోర్, గద్దీ ఛోడ్’’ అనే నినాదం బిహార్‌‌‌‌లోనే కాదు, చైనా, అమెరికాలో కూడా వినిపిస్తున్నదని పేర్కొన్నారు. 

మహారాష్ట్రలో లోక్‌‌‌‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆరు నెలల గ్యాప్​మాత్రమే ఉంది. అయితే ఈ ఆరునెలల్లోనే ఆ రాష్ట్రంలో కొత్తగా ఒక కోటి మంది ఓటర్లు వచ్చారని, అవన్నీ బీజేపీ కూటమికే పడ్డాయని.. ఎన్నికల కమిషన్ సహకారంతో ఈ చోరీ జరిగిందని ఆరోపించారు. కర్నాటకలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌‌‌‌లో ఒక లక్ష ఫేక్ ఓట్లను దేశ ప్రజలకు చూపించామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఓటరు లిస్టును మెషిన్ రీడబుల్ ఫార్మాట్​లో ఇవ్వలేదు, పోలింగ్​కు సంబంధించిన వీడియోలు షేర్ చేయలేదు అయినప్పటికీ ఎంతో కష్టపడి ఆధారాలు సేకరించి 
దేశ ప్రజల ముందు పెట్టామని వివరించారు.

16 రోజులు.. 1,300 కిలోమీటర్లు

ఆగస్టు 17న ససారాంలో మొదలైన ఈ 16 రోజుల యాత్ర, 25 జిల్లాల్లోని 110 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,300 కిలోమీటర్లు సాగింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ (ఎస్ఐఆర్) కు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితాల్లో అక్రమాలు లేవనెత్తుతూ ఈ యాత్ర చేశారు. మహిళలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలపై స్థానికులతో మాట్లాడారు. 

ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. అఖిలేశ్ యాదవ్, ప్రియాంక గాంధీ, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, ముకేశ్ సహానీ, దీపాంకర్ భట్టాచార్య, యూసుఫ్ పఠాన్, సంజయ్ రావత్ లాంటి వాళ్లు యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర బిహార్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌‌‌‌కు బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు.