రాహుల్​ జీ.. ఓసారి కాళేశ్వరం చూసి రండి: కేటీఆర్

రాహుల్​ జీ.. ఓసారి కాళేశ్వరం చూసి రండి: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ‘‘రాహుల్​జీ.. దేశానికే టీచింగ్​పాయింట్​తెలంగాణ. మంథని వరకు వెళ్లిన మీరు.. పక్కనే ఉన్న కాళేశ్వరం చూసి రండి” అని రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. ఇది దేశ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్​అద్భుతం. ఆ ప్రాజెక్టును చూసి తరించండి. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణ మాగాణాల్లోకి ఎలా మళ్లిస్తున్నామో అర్థం చేసుకోండి” అని సూచించారు. 

ఇకనైనా కాళేశ్వరంపై విమర్శలు మానుకోవాలన్నారు. ‘‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అన్నదాతను అరిగోస పెట్టినందుకు.. సాగునీటి కోసం నిత్యం సావగొట్టినందుకు.. తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా కాంగ్రెస్ చేసిన తప్పులకు.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి” అని అన్నారు. కాంగ్రెస్​చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమన్నారు.

‘‘శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే వందల మంది బలిదానాలకు కారణం. నిన్నయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ” అని విమర్శించారు. ‘‘గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన రోజే తెలంగాణలో కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీఫ్.. టికెట్ల కోసం కోట్ల రూపాయలు తీసుకోవడంతో పాటు భూములు రాయించుకుంటున్న రాబందు రేవంత్. మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది. 3 రోజులు పర్యటించినా 300 రోజులు ముక్కు నేలకు రాసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు” అని అన్నారు.