కేజ్రీవాల్​ పీఏ ఇంట్లో ఈడీ సోదాలు

కేజ్రీవాల్​ పీఏ ఇంట్లో ఈడీ సోదాలు

ఢిల్లీ జల్​ బోర్డు టెండర్​ అక్రమాలపై విచారణలో రెయిడ్స్​
న్యూఢిల్లీ: తమకు మేలు జరిగేలా ఢిల్లీ జల్​ బోర్డు టెండర్లలో ఆప్​ సర్కారు అక్రమ చెల్లింపులు చేసి రూ.17 కోట్లు లబ్ధి పొందిందన్న ఆరోపణలపై ఈడీ మంగళవారం సోదాలు నిర్వహించింది. కేజ్రీవాల్​ పీఏ బిభవ్​కుమార్, ఢిల్లీ జల్ బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్, పార్టీ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి ఎన్‌‌డీ గుప్తా, ఆప్​చార్టర్డ్  అకౌంటెంట్ పంకజ్ మంగళ్ తదితరుల ఇండ్లు, ఆఫీసులు సహా 12 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులో సోదాలు నిర్వహించారు.

ఢిల్లీ జల్​బోర్డు టెండర్​ ప్రక్రియలో అవకతవకల ద్వారా నిధులు సేకరించి ఆప్ ఎన్నికలకు  మళ్లించారనే ఆరోపణలపై ఈడీ రెయిడ్స్​నిర్వహించింది. ఢిల్లీ జల్ బోర్డులో జరిగిన అవినీతిపై సీబీఐ కేసు నమోదు చేయగా, నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈ కేసులో ఈడీ ఎంటరైంది. టెక్నికల్​గా ఏ మాత్రం అర్హత ప్రమాణాలులేని ఎన్​కేజీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కు ఆప్​సర్కారు రూ.38 కోట్ల కాంట్రాక్టు టెండర్​ ఇచ్చిందని, నకిలీ పత్రాలను సమర్పించి సదరు సంస్థ ఈ బిడ్‌‌ను దక్కించుకుందని ఈడీ అధికారులు తెలిపారు.

కాంట్రాక్టు విలువ రూ.38 కోట్లలో కేవలం రూ.17 కోట్లు మాత్రమే టెండర్ పనులకు వెచ్చించారని, మిగిలిన మొత్తాన్ని ఎన్నికల నిధులకు మళ్లించేందుకు తప్పుడు ఖర్చులు చూపారని ఈడీ గుర్తించింది. ఈ కేసులో భాగంగా ఈడీ జనవరి 31న జల్​ బోర్డు రిటైర్డ్​ చీఫ్ ​ఇంజనీర్ జగదీశ్​​కుమార్​ అరోరా, కాంట్రాక్టర్​ అనిల్ ​కుమార్​ అగర్వాల్​లను అరెస్ట్​ చేసింది. ఇందులో పెద్ద కుట్రే దాగి ఉందని, దాన్ని బయటకు తీసేందుకు నిందితులను కస్టడీలోకి ఇవ్వాలన్న ఈడీ అభ్యర్థనల మేరకు పీఎంఎల్ఏ స్పెషల్​కోర్టు సోమవారం నిందితుల రిమాండ్​ను మరో ఐదు రోజులు పొడిగించింది.