సీఎం టూర్లో రింగ్ రోడ్ బాధితుల ఆందోళన

 సీఎం టూర్లో రింగ్ రోడ్ బాధితుల ఆందోళన
  • అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ 

యాదాద్రి భువనగిరి జిల్లా:  రాయగిరికి చెందిన రిజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ కు తమ బాధలు చెప్పుకుంటామని ఊరేగింపుగా వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ వస్తున్నారని తెలిసి ఆయనను కలిసేందుకు వస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని భూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కన్న తల్లి ముద్దురా... నీ ఆర్ఆర్ఆర్ రోడ్డు వద్దురా.. ప్రాణాలైనా అర్పిస్తాం.. మా భూములను రక్షించుకుంటాం.. అలైన్ మెంట్ మార్పు చేయాలి..’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

అయితే భూ బాధితుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మేం సీఎంను కలువొద్దా.. మా బాధలు చెప్పుకోవద్దా.. ?.. మా భూములు పోయాక మేం ఎట్లా బతకాలి..? అంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు మాత్రం ఇలా కలిసేందుకు వీలు లేదు.. మాకు ఆదేశాలు లేవంటూ వారిని అక్కడే నిలిపేయడంతో బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సందర్భంగా పోలీసులు-భూ బాధితులకు మధ్య తోపులాట జరిగింది. భూములు ఇచ్చి తాము రోడ్డున పడ్డామంటూ భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధలు చెప్పుకుందామంటే అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.