వందే భారత్ తరహాలో వందే మెట్రో :కేంద్ర మంత్రి

వందే భారత్ తరహాలో వందే మెట్రో :కేంద్ర మంత్రి

రైల్వే బడ్జెట్‭లో తెలంగాణకు రూ.4,480 కోట్లు కేటాయించినందుకు..కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సారి వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తామని.. కొత్త లైన్ల పైనా దృష్టి పెడతామని ప్రకటించారు. వందే భారత్‌ తరహాలోనే వందే మెట్రోలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. నగరాలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల ప్రజల సౌలభ్యం కోసం వందే మెట్రోను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే చాలా చోట్ల అండర్ పాస్ లు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందన్నారు. 

వందే భారత్‭కు భిన్నంగా వందే మెట్రో ఉండబోతోందని రైల్వే మంత్రి ప్రకటించారు. 2017లోనే మోడీ వందే భారత్ గురించి ప్రస్తావించారని, పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే వందే భారత్ రైళ్ల తయారీ ప్రారంభమైందని అన్నారు. రైల్వే స్టేషన్‭లో ప్రయాణికులకు రోజువారి సరుకులు కూడా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణలో 59 స్టేషన్‭లను వర్కల్డ్ క్లాస్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. త్వరలో కొన్ని కొత్త ప్రాజెక్టులకు అనుమతిస్తామన్న ఆయన.. స్పీడ్ రైళ్లపై అధ్యాయనం చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ఎంఎంటీఎస్‭కు రూ.600 కోట్లు కేటాయించామని, అయితే ఎంఎంటీఎస్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం చేయాల్సింది చేస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని సూచించారు.