రైళ్లలో శుభ్రపరిచే విధానాన్ని మార్చాలె : కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

రైళ్లలో శుభ్రపరిచే విధానాన్ని మార్చాలె : కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

వందేభారత్ ట్రైన్‌లో ప్రయాణికులు చెత్తను వేస్తున్నారని ఇటీవల మీడియాలో వచ్చిన కొన్ని కథనాలపై  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైళ్లలో శుభ్రపరిచే విధానాన్ని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విమానాల్లో క్లీనింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నట్లుగానే క్లీనింగ్‌ విధానాన్ని అనుసరించాలని మంత్రి ఉద్ఘాటించారు. దాంతో పాటు  చెత్త వేయమని ప్రయాణికులను కోరుతున్న ఓ వ్యక్తి వీడియోను షేర్ చేశారు. దాంతో పాటు వందేభారత్ రైళ్లలో క్లీనింగ్ సిస్టమ్‌ను మార్చామని, రైళ్లలో పరిశుభ్రతను కాపాడుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలని వైష్ణవ్ ట్వీట్‌లో తెలిపారు.

అంతకు ముందు అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తెచ్చిన వందే భారత్ రైళ్లు చెత్తతో నిండిపోతున్నాయంటూ ఐఏఎస్ అవనీశ్ శరణ్ ట్విట్టర్ లో ఓ ఫొటో షేర్ చేశారు. వీ ది పీపుల్ క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలో వాటర్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు బోగిలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. స్వీపర్ వాటిని శుభ్రం చేసేందుకు సిద్ధమవుతున్న ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చర్యలకు ఉపక్రమించినట్టు స్పష్టం చేశారు.