రైళ్లలో లగేజీ చార్జీలు..లిమిట్ కు మించి తీసుకెళ్తే చార్జీ, పెనాల్టీ

రైళ్లలో లగేజీ చార్జీలు..లిమిట్ కు మించి తీసుకెళ్తే చార్జీ, పెనాల్టీ

న్యూఢిల్లీ: లగేజీ రూల్స్‌‌ను కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇకపై ఎయిర్‌‌‌‌పోర్టుల తరహాలో ప్యాసింజర్ల లగేజీని లెక్కగట్టనుంది. లిమిట్‌‌కు మించి లగేజీ తీసుకెళ్తే అదనపు చార్జీ, పెనాల్టీ విధించనుంది. రైళ్లలో ఎన్నో ఏండ్లుగా లగేజీ రూల్స్‌‌ ఉన్నాయి. కానీ అవి సరిగా అమలు కావడంలేదు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రధాన స్టేషన్లలో లగేజీ రూల్స్‌‌ను కఠినంగా అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫస్ట్ ఏసీలో 70 కిలోలు, సెకండ్ ఏసీలో 50 కిలోలు, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్‌‌లో 40కిలోలు, జనరల్ బోగీల్లో 35 కిలోల వరకు లగేజీ ఉచితంగా తీసుకెళ్లవచ్చు. లగేజీ లిమిట్‌‌కు మించి కొంచెం ఎక్కువగా ఉంటే అదనపు చార్జీ వేస్తామని, కానీ చాలా ఎక్కువగా ఉంటే పెనాల్టీ విధిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఇవి కొత్త నిబంధనలు కాదని, ఎప్పటి నుంచో ఉన్నాయని స్పష్టంచేశారు. రూల్స్‌‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు.