వాతావరణ శాఖ హెచ్చరిక: రాగల మూడు రోజుల్లో వర్షాలపై తాజా అప్డేట్ ఇదే..

వాతావరణ శాఖ హెచ్చరిక: రాగల మూడు రోజుల్లో వర్షాలపై తాజా అప్డేట్ ఇదే..

హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం రోజు ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు పరిసర తెలంగాణ ప్రాంతం వద్ద కొనసాగిన ఆవర్తనం ఈరోజు రాయలసీమ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. నిన్నటి ద్రోణి, ఈరోజు రాయలసీమ మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఆవర్తనం నుంచి తమిళనాడు మీదుగా కోమరిన్  ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో కొనసాగుతున్నది. ఈ కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. షేక్పేట్ ఫ్లై ఓవర్పై తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. షేక్పేట్,  ఫిలింనగర్, గచ్చిబౌలి, గోల్కొండ, మెహిదీపట్నం, టోలిచౌకి, నానక్రాం గూడ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ఒక్కసారిగా దంచి కొట్టిన వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మాన్సూన్ టీమ్స్ రోడ్లపై వాటర్ లాగింగ్ ఏరియా క్లియర్ చేస్తుంటే.. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో తలమునకలై ఉన్నారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. ఉరుములు లేవు. మెరుపులు లేవు. కాసేపట్లో మబ్బులు కమ్మాయి. కుండపోత కురిసింది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నాంపల్లి, కోఠితో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో  వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనదారుల ఇక్కట్లు మాటలతో వర్ణించలేం. మాసబ్‌ట్యాంక్‌, ప్యారడైజ్, షేక్ పేట్ నాలా , రసూల్‌పుర, బేగంపేట, ఎన్టీఆర్‌ భవన్, జూబ్లీచెక్‌పోస్ట్‌లో ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా వాహనదారులు చాలా ఇబ్బందిపడ్డారు. GHMC, ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర ప్రజలను హెచ్చరించారు.