రేపు, ఎల్లుండి వడగండ్ల వాన

రేపు, ఎల్లుండి వడగండ్ల వాన
  • వాతావరణ శాఖ ఆరెంజ్​ అలర్ట్​
  • రైతులు పంటను కాపాడుకోవాలని సూచన 
  • ఇయ్యాల్టి నుంచి రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు
  • హైదరాబాద్​లో దంచికొట్టిన వాన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వాతావరణ శాఖ మరోసారి వడగండ్ల వాన అలర్ట్​ను జారీ చేసింది. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వానలు కురుస్తాయని, రెండు రోజులు (శుక్ర, శనివారాలు) వడగండ్ల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. ఆరెంజ్​ అలర్ట్​ ఉన్న రోజుల్లో ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, నిర్మల్​, మంచిర్యాల, నిజామాబాద్​, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, వరంగల్​, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్​ జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్తాయని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

పంటలు జాగ్రత్త

మూడు వారాల కిందట కురిసిన వడగండ్ల వాన లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 2.3 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. మళ్లీ ఇప్పుడు వడగండ్ల వానలు పొంచి ఉండటంతో రైతులు తమ పంటలను కాపాడుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వానల ప్రభావం ఉండే అవ కాశాలున్న జిల్లాల కలెక్టర్లకు రెయిన్​ అలర్ట్​ బులెటిన్​ను ఇప్పటికే పంపించింది. అన్ని జిల్లాల్లోనూ ముందస్తుగా వేసిన వరి పంట ఇప్పటికే కోత దశకు వచ్చింది. పలు జిల్లాల్లో కొందరు రైతులు మక్కలను కోసి రోడ్లు, కల్లాల్లో ఎండబెడ్తున్నారు. ఇటు మామిడి తోటలు కూడా ఇప్పుడిప్పుడే రైతుల చేతికొస్తున్నాయి. ఈనేపథ్యంలో మరోసారి వడగండ్ల వానలు కురిస్తే రైతులకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. 

పొద్దంతా ఎండ.. సాయంత్రానికి వాన 

రాష్ట్రంలో పలుచోట్ల బుధవారం తేలికపాటి జల్లులు కురిశాయి. హైదరాబాద్​లో దంచికొ ట్టింది. బుధవారం పొద్దంతా ఎండ తీవ్రత కొన సాగగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. తొలుత అమీర్​పేట, ఉప్పల్​లో జల్లులతో మొదలైన వాన.. వివిధ ప్రాంతాల్లో  దంచికొట్టింది. అరగంట పాటు ఉరుములు, మెరుపులతో వాన  కురిసింది. షేక్​పేట, టోలీచౌకి, ఖైరతాబాద్​, ఆసిఫ్​నగర్​, అమీర్​పేట, శేరిలింగంపల్లి, నాంపల్లి, మెహిదీపట్నం, మౌలాలి, రాజేంద్రనగర్​, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో వాన పడింది. టోలీచౌకిలో అత్యధికంగా 2.2 సెంటీమీటర్లు, షేక్​పేటలో 1.7, బంజారాహిల్స్​ వెంకటేశ్వరకాలనీలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడ్డాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిద్దిపేటలోని మద్దూరులో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి, మేడ్చల్​, రంగారెడ్డి, హైదరాబాద్​, మంచిర్యాల జిల్లాల్లోనూ చిరుజల్లులు పడ్డాయి.   రాష్ట్రంలో పలుచోట్ల వానలు పడినా.. ఎండలు కూడా అంతే స్థాయిలో మండిపోయాయి. బుధవారం పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్​ జిల్లా దస్తూరాబాద్​లో 43 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్​లో 42.7, ఆదిలాబాద్​ అర్బన్​లో 42.5, జగిత్యాల జిల్లా గోదూరులో 42.3, జైనలో 42.2, ఆలంపూర్​, నిజామాబాద్​ జిల్లా యెర్గట్లలో 41.9, వెల్గటూర్​లో 41.8, వనపర్తి జిల్లా కేతేపల్లిలో 41.7, నిజామాబాద్​ నార్త్​లో 41.6 డిగ్రీల 
ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.