మెదక్ జిల్లాలో వాన బీభత్సం

మెదక్ జిల్లాలో వాన బీభత్సం
  • పెద్ద మొత్తంలో తడిసిన వడ్లు
  • దెబ్బతిన్న కూరగాయల పంటలు
  • నేలరాలిన మామిడికాయలు
  • రెండు వేల కోళ్లు మృతి

మెదక్ (శివ్వంపేట, వెల్దుర్తి, రేగోడ్​) వెలుగు: మెదక్ జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి, సోమవారం పొద్దున జిల్లాలోని చాలా చోట్ల భారీగా వర్షం పడింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున వడ్ల సంచులు తడిసిపోయాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలిపోయాయి. రెండు వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. పలు చోట్ల ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. రేగోడ్  మండల కేంద్రంలో  పీఏసీఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లన్నీ తడిసిపోయాయి. వడ్ల కుప్పల మీద టార్పాలిన్ కవర్ లు కప్పినప్పటికీ వర్షపు నీళ్లు లోపలక వెళ్లడంతో వడ్లు తడిసిపోయాయి. శివ్వంపేట మండలం తాళ్లపల్లిగడ్డ తండా, చిన్నగొట్టి ముక్కుల, శివ్వంపేటలో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యంతోపాటు, శివ్వంపేటలోని రైస్​ మిల్ వద్ద ట్రాక్టర్లలో ఉన్న ధాన్యం కూడా తడిసిపోయింది. కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్, పోతం శెట్ పల్లిలో, టేక్మాల్, హవేలి ఘనపూర్, చిలప్​చెడ్​ మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో తూకంవేసి సంచుల్లో నింపిపెట్టిన ధాన్యం కూడా వర్షానికి తడిసింది. 

చెట్టు విరిగిపడి క్లాస్ రూం రేకులు ధ్వంసం

శివ్వంపేట మండలం పిలుట్లలో ఈదురు గాలులకు  ప్రైమరీ స్కూల్  వద్ద పెద్ద చెట్టు కూలిపడడంతో ఓ క్లాస్​ రూం రేకులు ధ్వంసమయ్యాయి. స్కూల్​ వాచ్ మన్  అంజయ్య మరో గదిలో పడుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇదే మండలం తిమ్మాపూర్ లో మంజుల అనే మహిళా రైతు అర్ధరాత్రి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్లకుప్పపై  టార్పాలిన్  కవర్  కప్పడానికి వెళ్లగా పిడుగుపాటుకు గురైంది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

దెబ్బతిన్న కూరగాయల సాగు

కొల్చారం మండలం నాయిని జలాల్​ పూర్​లో ఈదురు గాలులు, భారీ వర్షానికి కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. శివ్వంపేట మండలం టిక్యా దేవమ్మగూడ తండాలో మదన్​లాల్​ అనే రైతు ఎకరా విస్తీర్ణంలో పందిరి విధానంలో చిక్కుడు సాగు చేశాడు. ఈదురు గాలులకు చిక్కుడు పంట దెబ్బతిన్నది. వెల్దుర్తి మండల పరిధిలోని దామరంచ గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి చెట్టు విరిగి పౌల్ట్రీ ఫాంపై పడటంతో ఫాం పూర్తిగా ధ్వంసమై దాదాపు రెండువేల కోళ్లు చనిపోయాయి. షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రూ.15 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని బాధితుడు భగవాన్ రెడ్డి తెలిపారు.