హైదరాబాద్కు ఆరెంజ్ కాదు.. రెడ్ అలర్ట్.. ఐదు రోజులు కుండపోత వర్షాల హెచ్చరిక

హైదరాబాద్కు ఆరెంజ్ కాదు.. రెడ్ అలర్ట్.. ఐదు రోజులు కుండపోత వర్షాల హెచ్చరిక

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  హైదరాబాద్ తో పాటు.. తెలంగాణలో పలు జిల్లాలలో భీకర వానలు పడతాయని ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 4వ తేదీ హైదరాబాద్ తో పాటు..పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..సెప్టెంబర్ 5వ తేదీన రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం  కొనసాగుతోంది. ఈశ్యాన మధ్య బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం.. ద్రోణి ప్రభావంతో  తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.

ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్..

తెలంగాణలో  8 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో  భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా  మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం అధికారులు  ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. 

హైదరాబాద్ లో ఈ ఐదు రోజుల పాటు బీభత్సమైన వానలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.  ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు  నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

అత్యవసరం అయితేనే రండి

ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరించింది. ఎలాంటి పరిస్థితుల్లో ఇళ్లు వదిలి రావొద్దని హెచ్చరించింది.