జనాలను పరేషాన్​ చేసిన వర్షం

జనాలను పరేషాన్​ చేసిన వర్షం
  • వరంగల్​లో నీట మునిగిన 10కి పైగా  కాలనీలు
  • గద్వాలలో పిడుగు పడి రైతు మృతి
  • జగిత్యాల జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన బాలుడు
  • గుట్టలో కూలిన పాత ఘాట్ రోడ్డు

ఒక్క వాన ఆగమాగం చేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం జనాలను పరేషాన్​ చేసింది. నిర్మల్​ పట్టణం జలవలయంలో చిక్కుకోగా, వరంగల్ లో పదికి పైగా కాలనీలు మునిగాయి. ఇండ్లను వరద ముంచెత్తడంతో చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.  గద్వాల జిల్లా సంగాలలో పిడుగు పడి రైతు చనిపోయాడు. జగిత్యాల జిల్లా రాయికల్ ​మున్సిపల్ ​పరిధిలో ఓ పిల్లవాడు ఇంటిముందు ఆడుకుంటూ వరదలో కొట్టుకుపోయి చనిపోయాడు. 

నిర్మల్​, వెలుగు : నిర్మల్ ​జిల్లా కేంద్రం బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి జలదిగ్బంధంలో చిక్కుకుంది. గంటన్నరకు పైగా కురిసిన వర్షంతో రోడ్లపై వరద ఏరులై పారింది. ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీలన్నీ పొంగి పొర్లి  ఆ నీళ్లన్నీ రోడ్లపైకి వచ్చాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. డాక్టర్స్ ​లేన్ ​ప్రాంతంలో సమస్య ఎక్కువగా కనిపించింది. మంచిర్యాల్​చౌరస్తా, శాస్త్రీనగర్, విశ్వనాథ్​పేట్​, వైఎస్ఆర్​కాలనీ, ప్రియదర్శిని నగర్​, నటరాజ్​నగర్​, మంజూలపూర్ ప్రాంతాల్లో వరద పొంగి పొర్లింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తిప్పలు పడ్డారు. ఇటీవలి వర్షాలకు అతలాకుతలమైన నిర్మల్​ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి భారీ వాన ఉక్కిరి బిక్కిరి చేసింది.  

వరదలో చిక్కుకున్న వరంగల్​

వరంగల్:  గ్రేటర్​వరంగల్​లో మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వాన పడగా దాదాపు 10కి పైగా కాలనీలు నీటమునిగాయి. ఇండ్లల్లోకి నీళ్లు చేరడంతో సామగ్రి తడిసిపోయింది. పిడుగుల ప్రభావంతో హనుమకొండ హనుమాన్‍నగర్‍, వెంకట్రామయ్యకాలనీ, సుందరయ్యనగర్‍, గుండ్లసింగారంలలో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయాయి. గ్రేటర్‍ వరంగల్​లో అత్యధికంగా 140.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్‍టీఆర్‍ కాలనీ, బీఆర్‍ నగర్‍, హంటర్​ రోడ్​ , ఎస్‍బీహెచ్‍ కాలనీ, హనుమకొండలోని పోచమ్మకుంట, వెంకట్రామయ్యకాలనీ, నయీంనగర్‍, రాజాజీనగర్‍, సమ్మయ్యనగర్‍ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 

ప్రాణాలు తీసిన పిడుగు  

గద్వాల : గద్వాల మండలం సంగాల గ్రామంలో పిడుగు పడి ఓ రైతు చనిపోయాడు. గ్రామానికి చెందిన రైతు కొత్త కురువ ఆంజనేయులు(53) బుధవారం పొలాన్ని ట్రాక్టర్ తో దున్నిస్తున్నాడు. డ్రైవర్ పొలంలో పని చేస్తుండగా ఆంజనేయులు గట్టుపై నిలబడి ఉన్నాడు. ఇంతలో ఉరుములు మెరుపులతో వాన మొదలై పిడుగు పడడంతో కుప్పకూలి కింద పడిపోయాడు. డ్రైవర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చేసరికే చనిపోయాడు. రైతుకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, భార్య ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆనంద్​ తెలిపారు.

ఆడుకుంటూ కొట్టుకుపోయిండు 

రాయికల్ :  జగిత్యాల జిల్లాలో వర్షానికి వచ్చిన వరదలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ పిల్లవాడు కొట్టుకుపోయి చనిపోయాడు. రాయికల్ మున్సిపాలిటీ పరిధిలోని వీరాపూర్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఫకీర్ నగర్ కాలనీకి చెందిన అక్బర్-, నజీమా దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలున్నారు. బుధవారం మధ్యాహ్నం రాయికల్ లో భారీ వర్షం పడడంతో వరద చేరి డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ఇదే సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న అక్బర్ ​పెద్ద కొడుకు అఫ్సర్ (4) వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు గాలించగా కిలోమీటర్ దూరంలో డెడ్​బాడీ కనిపించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రాయికల్ ఎస్సై కిరణ్ తెలిపారు.  

యాదాద్రిలో పాత ఘాట్ రోడ్డు కూలింది...

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పాత ఘాట్ రోడ్డు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కూలింది. కొండపై నుంచి వచ్చిన వరదతో ఘాట్ రోడ్డు రెయిలింగ్​కోతకు గురికాగా రోడ్డు కుంగి కూలిపోయింది. పాత ఘాట్ రోడ్డు నుంచి కొండపైకి వెళ్లే దారిలో ఉన్న నాగదేవత పుట్ట ఎదురుగా రోడ్డు కుంగి బేస్​మెంట్​లో ఉన్న రాళ్లన్నీ కింద పడ్డాయి. రాత్రి కావడం, వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 1940లో కేవలం మట్టి, రాళ్లతో నిర్మించిన ఘాట్ రోడ్డు కావడంతో.. వర్షాలకు డ్యామేజ్ అయి కూలిందని ఆర్అండ్ బీ ఆఫీసర్లు తెలిపారు. బుధవారం ఉదయం రోడ్డు కూలిన ప్రదేశాన్ని ఈఎన్సీ రవీందర్ రావు పరిశీలించారు. ఆర్​అండ్​బీ ఆఫీసర్లు రిపేర్లు మొదలుపెట్టారు.  

తాళ్లు కట్టి విద్యార్థులను రోడ్డు దాటించిన్రు

సైదాపూర్ : ఇంటర్ ​సప్లిమెంటరీ పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులు రోడ్యాంను వరద ముంచెత్తడంతో చిక్కుకుపోయారు. దీంతో స్థానికులు తాళ్ల సాయంతో వారిని సురక్షితంగా తీసుకువచ్చారు. కరీంనగర్​ జిల్లా సైదాపూర్–హుజూరాబాద్​ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. సైదాపూర్​లోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో ఇంటర్​సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ నడుస్తున్నాయి. దీంతో మండల కేంద్రం నుంచి కాలేజీకి పరీక్ష రాయడానికి వచ్చారు. ఎగ్జామ్​ రాసి వెళ్తుండగా పక్కనే ఉన్న నాలా చెరువు మత్తడి దూకి రోడ్యాంపై వరద పోటెత్తింది. దీంతో  విద్యార్థులు అటువైపే ఆగిపోయారు. గమనించిన స్థానికులు రెండు వైపులా చెట్లకు తాడుకట్టి విద్యార్థులతో పాటు ప్రయాణికులు కూడా వచ్చేలా చేశారు.  అలాగే సోమారంలోని టీఎస్ ​మోడల్​ స్కూల్​వాగు పక్కనే కట్టడంతో వరదతో నిండిపోయింది. దీంతో టీచర్లు పిల్లలను బయటకు తీసుకువచ్చారు. సోమేశ్వర కుంట, సోమారం చౌరస్తా, సైదాపూర్​లో రోడ్లు మునగడంతో సాహసం చేసి దాటించి ఇండ్లకు చేర్చారు.