గ్రేటర్ లో గంటన్నర పాటు దంచి కొట్టిన వాన

గ్రేటర్ లో  గంటన్నర పాటు దంచి కొట్టిన వాన

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో సోమవారం సాయంత్రం గంటన్నర పాటు వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వాన మొదలైంది. గత వారం కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాల జనం ఇప్పుడిప్పుడే వరద నుంచి బయటపడగా.. మళ్లీ భారీ వర్షం పడటంతో మరింత ఇబ్బందిగా మారింది. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచి స్కూల్స్, కాలేజీలు, ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. 

ట్రాఫిక్ మూవ్​మెంట్ స్లోగా సాగింది. ఎల్​బీనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, నానల్ నగర్, సికింద్రాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాత్రి 11 గంటల వరకు మియాపూర్​లో అత్యధికంగా 5.8 సెం.మీ, తిరుమలగిరి 5.7, హైదర్​నగర్​లో 5.1 , ఆనంద్​బాగ్, వెస్ట్​ మారేడ్​పల్లిలో 4.9 సెం.మీల  వర్షపాతం నమోదైంది. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.