నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

హైదరాబాద్ మహానగరాన్ని తొలకరి జల్లు పలకరించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. దీంతో వాహనదారులకు కాస్త ఇబ్బంది కలిగింది. మరోవైపు బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‭లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో చల్ల గాలులు వీస్తున్నాయి.

మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాల వల్ల భారీ వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం కారణంగా తెలంగాణతో పాటు ఏపీలోనూ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండటం వలన వర్ష తీవ్రత కోస్తాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు.