నాలుగు రోజులు భారీ వర్షాలు..30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్

నాలుగు రోజులు భారీ వర్షాలు..30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్
  • వాతావరణ శాఖ వెల్లడి.. శనివారం పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన..
  • అత్యధికంగా జనగామ జిల్లా వడ్లకొండలో 11 సెం.మీ. నమోదు
  • శ్రీశైలం ప్రాజెక్టుకు 1.56 లక్షల క్యూసెక్కుల వరద.. సాగర్​కు పెరుగుతున్న ఫ్లడ్​

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. సోమ, మంగళవారాల్లో అతిభారీ వర్షాలు, ఆ తర్వాతి రోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ సిటీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సాయంత్రం, రాత్రి పూట ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. 

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

కృష్ణానది పరీవాహకంలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. దిగువకు 1,22,836 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు  39 వేల క్యూసెక్కుల చొప్పున ఇన్​ఫ్లో ఉండగా.. అంతే మొత్తాన్ని కిందికి వదులుతు న్నారు. దీంతో శ్రీశైలానికి 1,56,327 క్యూసెక్కు ల ప్రవాహాలు నమోదవుతున్నాయి. దిగువన నాగార్జునసాగర్​కు 89,468 క్యూసెక్కులను రిలీ జ్​ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 215.81 టీఎంసీలకుగానూ 198.36 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. నీటి మట్టం 885 అడుగులకుగానూ 881.90 అడుగులుగా ఉన్నది. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో నాగార్జునసాగర్​లో నీటి నిల్వ క్రమంగా పెరుగుతున్నది. సాగర్​ ప్రాజెక్టుకు 67,800 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతున్నది. ప్రస్తుతం సాగర్​ నీటి మట్టం 590 అడుగులకు గాను.. 564.40 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 312.05 టీఎంసీలకు 242.72 టీఎంసీలుగా ఉన్నది. కాగా, గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టులకు మాత్రం వరద ప్రవాహాలు ఇప్పటికీ నమోదు కాలేదు. ఎగువన గోదావరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో గోదావరికి వరద రావడం లేదు.

అన్ని జిల్లాల్లోనూ వర్షం

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ శనివారం వర్షం కురిసింది. ముఖ్యంగా 8 జిల్లాల్లో జనగామ, కరీంనగర్​, హైదరాబాద్​, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్​నగర్​, మెదక్, నిర్మల్​ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ములుగు, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొన్ని చోట్ల చెదురు మదురు జల్లులు కురిశాయి. అత్యధికంగా జనగామ జిల్లా వడ్లకొండలో 11.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.