కల్లాల్లో తడిసిన ధాన్యం .. తుఫాన్​ ఎఫెక్ట్​తో తెలంగాణ వ్యాప్తంగా వానలు

కల్లాల్లో తడిసిన ధాన్యం ..  తుఫాన్​ ఎఫెక్ట్​తో తెలంగాణ వ్యాప్తంగా వానలు
  • వడ్లను కాపాడుకునేందుకు రైతుల తిప్పలు
  • పలు జిల్లాల్లో కోతకొచ్చిన వరి నేలకొరిగింది
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్​
  • వడ్లు తడవకుండా చర్యలు చేపట్టాలని సూచన

తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోతకు వచ్చిన వరి, కల్లాల్లో పోసిన వడ్లకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన వడ్లను ఆరబోసేందుకు, కుప్పలు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల టార్పాలిన్లు అందుబాటులో లేక ఇబ్బంది పడ్తున్నారు. పలు జిల్లాల్లో కోతకు వచ్చిన వరి నేలవాలడంతో నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం.. 

తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా అశ్వారావుపేటలో 14.03 సెంటీ మీటర్లు, మధిరలో 9.83, వేంసూరు, సత్తుపల్లిలో 9.28, దమ్మపేటలో 8.88, చింతకానిలో 7.63, బోనకల్​లో 7.4, భద్రాచలంలో 4.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

గాలివాన కారణంగా అనేకచోట్ల కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. భద్రాచలం మన్యంలోని గోదావరి తీరంలో మిరప, పత్తి, వరి చేన్లకు అపార నష్టం వాటిల్లింది. సర్వే టీములు వెళ్తే గానీ నష్టం ఏ స్థాయిలో జరిగిందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే బొబ్బ తెగులుతో మిరప తోటలు నాశనం కాగా, దూది చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాల వల్ల పత్తిచేలు ఒరిగిపోయాయి. కాగా, వర్షం కారణంగా ఖమ్మం జిల్లాలో బుధవారం కూడా విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సెలవు ప్రకటించారు. కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి వర్షాల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అలర్ట్​..

తుపాన్‌‌ హెచ్చరికలతో భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ముందస్తు చర్యలు ప్రారంభించారు. మోరంచవాగు, చలివాగు, జంపన్న వాగు, గుండ్లవాగు, ప్రధాన చెరువులు, గోదావరి నది పరిసరాలలోని ప్రజలు అప్రమతంగా ఉండాలని, ప్రమాదం అని భావిస్తే సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి సబ్‌‌ డివిజన్‌‌ పరిధిలో రెస్క్యూ టీమ్​లను అందుబాటులో ఉంచారు. ప్రతీ పోలీస్ స్టేషన్లో పెద్ద, పెద్ద తాళ్లు, ట్యూబ్‌లు, విజిల్స్, టార్చ్ లైట్లు, పెట్రోల్ వుడ్ కట్టర్స్ మొదలైన అత్యవసర వస్తువులు రెడీగా ఉంచుకోవాలని ఆదేశించారు.

మెదక్ జిల్లాల్లో తడిసిన వడ్లు..

మెదక్ జిల్లా చిన్నగొట్టిముక్కుల నుంచి సికింద్లాపూర్ వరకు రోడ్డు మీద ఆరబోసిన వడ్లు వర్షానికి తడిసిపోయాయి. ఆరబోసే పరిస్థితి లేకపోవడంతో మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్, నాగసాన్ పల్లి, తిమ్మాపూర్ కొనుగోలు సెంటర్లలో వారం కింద పడ్డ వర్షానికి వడ్లు తడిసిపోగా తిరిగి ఆరబెట్టారు. తేమ ఎక్కువ ఉందని కాంటా పెట్టకపోవడంతో వడ్ల కుప్పలు పెరిగాయి. మళ్లీ వర్షం కురుస్తుండటంతో మళ్లీ తడిసిపోతాయని రైతులు ఆందోళనడుతున్నారు. టేక్మాల్ పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లలో ధాన్యం తూకం చేయకపోవడంతో వడ్ల కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు.

సెంటర్లలో రైతుల పడిగాపులు..

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో మంగళవారం కురిసిన కొద్దిపాటి వర్షానికి  సింగిల్ విండో కొనుగోలు సెంటర్ దగ్గరున్న వడ్లు తడిశాయి. సిద్దిపేట జిల్లాలో ఇంకా లక్షా ఇరవై వేల టన్నుల వడ్లు  కొనుగోలు చేయాల్సి ఉండగా, వర్షం వల్ల కొనుగోళ్లు నిలిచాయి. దీంతో రైతులు కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యాదాద్రి జిల్లాలో దాదాపు లక్ష టన్నుల వడ్లు సెంటర్లలో ఉన్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు వడ్లు తడవకుండా రైతులు తిప్పలు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో మబ్బులు కమ్ముకోవడంతో కల్లాల్లో కుప్పలను కాపాడుకునేందుకు కవర్లు కప్పుకుంటున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. వడ్లు తడవకుండా టార్పాలిన్లు, కవర్లు కప్పినా భారీ వర్షం కురిస్తే తడిసిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో మంగళవారం ఉదయం వర్షం పడగా వడ్ల కుప్పల దగ్గర నిలిచిన నీటిని తొలగించడానికి రైతులు తిప్పలు పడుతున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.

పలు రైళ్లు రద్దు 

రెండు రోజులుగా మిగ్ జాం తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే 305 రైళ్లను రద్దు చేసింది వీటిలో కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని పూర్తిగా, ఇంకా కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఈమార్పులు ఈనెల 8 వరకు కొనసాగుతాయని తెలిపారు.

కవర్లు లేక ధాన్యం తడిసిపోయింది.

మూడు ఎకరాలలో వరి సాగు చేశాను. రెండు రోజుల కింద కోత కోసి 120 బస్తాల వడ్లు తెచ్చి ఆరబోసిన. వానలు పడడంతో పూర్తిగా తడిసిపోయింది. కవర్ లు అందుబాటులో లేక తెచ్చిన ధాన్యం తడిసిపోయింది.
 

- తిరుపతి రెడ్డి, రైతు, బయ్యారం గ్రామం, సిద్దిపేట జిల్లా

కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలి

నేను ఆరెకరాలు వరి వేసిన. కోసి నెల దాటింది. అయినా ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించక ఇబ్బందులు పడుతున్నం. ప్రైవేటులో అమ్ముకుందామంటే అగ్గువ ధరకు అడుగుతున్నరు. వడ్లు కల్లంలో కుప్పలు పొసి నెల దాటింది. వానలు పడితే వడ్లు కల్లంలనే తడిసిముద్దయితయ్. తొందరగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలి.
- ముడుపు రఘోత్తం రెడ్డి, రైతు, దహెగాం, ఆసిఫాబాద్ జిల్లా

నేడు 5 జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలంలో అత్యధికంగా 
14 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో చాలా చోట్ల 5 సెం.మీ.పైగా, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 2 నుంచి 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

అలర్ట్​గా ఉండండి: రేవంత్​

హైదరాబాద్, వెలుగు: మిగ్​జాం తుఫాను నేపథ్యంలో అలెర్ట్​గా ఉండాలని రాష్ట్ర అధికారులను సీఎల్పీ నేత రేవంత్​ రెడ్డి కోరారు. లోతట్టు ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో జనజీవనం స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వానలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. ఎక్కడికక్కడ రైతులకు అండగా నిల వాలని కోరారు. అవసరమైన సహాయ చర్య లకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈశాన్య జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నందున అక్కడ లోతట్టు ప్రాంతాలు, వాగులు ఉన్న ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తుఫాన్ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం, సురక్షిత నీరు అందేలా చూడాలిని సూచించారు.

ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లకు భట్టి ఫోన్​

తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. చెరువులు, వాగులు పొంగిపొర్లితే ప్రాణనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తుఫాన్​ ప్రభావం వల్ల రైతులు ఆందోళన పడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.