
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలుచోట్ల వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్యా రాష్ట్రాల్లోనూ ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా 280 రహదారులు మూతపడ్డాయి. రాష్ట్రంలో 458 విద్యుత్, 48 నీటిపథకాలు దెబ్బతిన్నట్టు అధికారులు వెల్లడించారు. శని, ఆదివారాల్లో పంజాబ్, రాజస్థాన్‌లో 20 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా, దేశంలోని 11 రాష్ట్రాల్లో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉన్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అస్సాం, మేఘాలయ, కేరళకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
హిమాచల్‌లో 3 నెలల్లో 100 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 27 నుంచి ఆగస్టు 9 మధ్య భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించగా, 19 కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మందికిపైగా మరణించారు. వరదలతో రూ.842 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
ఒకే కుటుంబంలో ఎనిమిది మంది..
పంజాబ్‌లోని పంజాబ్‌లోని హోషియార్ పూర్లో ఉధృతంగా ప్రవహిస్తున్న ఓ నదిలో కారు మునిగిపోయింది. ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. రెస్క్యూ టీం ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. పది మంది కుటుంబ సభ్యులు కారులో హిమాచల్‌ప్రదేశ్‌లోని డెహ్రానుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్ నగర్ మెహ్రౌల్కు పెండ్లి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
రాజస్థాన్‌లో నదిలో పడి..
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నది ఒడ్డున కూర్చున్న ఏడుగురు పిల్లలు ప్రమాదవశాత్తూ నీళ్లలో పడిపోయారు. ప్రవాహంలో కొట్టుకుపోయి వారంతా చనిపోయారు. భరత్ పూర్ జిల్లా నంగ్లా గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. ఇక, కరౌలీ జిల్లాలోని డోలిఖర్ మొహల్లాలో ఓ ఇల్లు కూలిపోగా.. తండ్రి, కొడుకులు మృతిచెందారు. మరో ఇద్దరి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు.