మేం కోలుకోవడానికి ఏడాది పడ్తది: సీఎం సుఖ్వీందర్

మేం కోలుకోవడానికి ఏడాది పడ్తది: సీఎం సుఖ్వీందర్

సిమ్లా: వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర నష్టం జరిగింది. జులై, ఈ నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం సంభవించిందని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. బుధవారం ఆయన పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నదని, దాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ఒక ఏడాది పడుతుందని సుఖ్వీందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
 ‘‘రోడ్లు, వాటర్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. వాటిని రిపేర్ చేసేందుకు పనులు మొదలుపెట్టాం. మా ముందు ఒక పెద్ద పర్వతం అంతటి సవాల్ ఉన్నది. అయినప్పటికీ మేం వెనకడుగు వేయం. ఈ విషాదం నుంచి బయటపడేందుకు మాకొక ఏడాది పడుతుంది” అని చెప్పారు. రాష్ట్రంలో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయని, మొదటిసారి ఒకేరోజు 50 మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంతకుముందెప్పుడూ వర్షాకాలంలో ఈ స్థాయిలో వానలు పడలేదని పేర్కొన్నారు. 
కేంద్ర సాయం పెంచాలె..
ఇండ్ల నిర్మాణం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని సుఖ్వీందర్ అన్నారు. ‘‘ఇండ్లలోకి నది నీళ్లు రాలేదు. ఇండ్లే నదుల్లో కట్టారు” అని కామెంట్ చేశారు. బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ రూల్స్ ను కఠినం చేస్తామని, కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తామని చెప్పారు. తరచూ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ మొత్తంలో సాయం అందించాలని కోరారు.
 ‘‘డ్యామేజ్ అయిన రోడ్లను రిపేర్ చేసేందుకు కేంద్రం కిలోమీటర్​కు రూ.1.5 లక్షలు ఇస్తుంది. కానీ అది ఏమాత్రం సరిపోదు. హిమాచల్ ప్రదేశ్ లాంటి హిల్ స్టేట్స్​కు విపత్తు నిధులను పెంచాలి” అని డిమాండ్ చేశారు. సిమ్లా, కాంగ్రాలో రోడ్లను రిపేర్ చేశామని.. రాష్ట్రానికి టూరిస్టులు రావాలని కోరారు. ‘‘వర్షాకాలం తర్వాత ఎప్పుడైనా రాష్ట్రానికి రండి. ఇక్కడే దీపావళి, న్యూ ఇయర్ జరుపుకోండి” అని టూరిస్టులకు పిలుపునిచ్చారు. 
స్కూళ్లు, కాలేజీలు బంద్.. 
రాష్ట్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వానల వల్ల 61 మంది చనిపోయారు. సమ్మర్ హిల్ ఏరియాలో కొండచరియలు విరిగిపడి శివాలయం కూలిన ప్రాంతంలో మరో డెడ్ బాడీని వెలికితీశామని అధికారులు బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీయగా, మరో 10 డెడ్ బాడీలు ఇంకా శిథిలాల కిందనే ఉన్నాయని చెప్పారు.
 కృష్ణానగర్, ఫాగ్లీలోనూ కొండచరియలు విరిగిపడగా.. ఈ రెండు చోట్ల 7 మృతదేహాలను వెలికితీసినట్టు వెల్లడించారు. సమ్మర్ హిల్ లో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు. కాగా, వర్షాల కారణంగా బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంజేశారు.