
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, దాని ప్రభావంతో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడొచ్చని పేర్కొంది. మంగళవారం యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ సిటీల్లో భారీ వర్షం కురిసింది. నల్గొండ, ఖమ్మం, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, జగిత్యాల జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామన్నపేటలో 6.9, నారాయణపూర్‌లో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ సిటీలో అత్యధికంగా జూపార్క్ వద్ద 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.