పెరిగిన చలి.. పట్టపగలే చీకటి.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

పెరిగిన చలి.. పట్టపగలే చీకటి..   పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • పెరిగిన చలి.. పట్టపగలే చీకటి
  • రాష్ట్రమంతా చిరుజల్లులు.. పడిపోయిన ఉష్ణోగ్రతలు  
  • వణికిస్తున్న వెదర్.. బయటకురాని జనం 
  • ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పంట నష్టం 
  • వడ్లు మొలకలు వస్తాయని రైతుల ఆందోళన 

వెలుగు, నెట్​వర్క్ : తుఫాన్ ఎఫెక్ట్​తో రాష్ట్రవ్యాప్తంగా మబ్బులు కమ్ముకొని చిరుజల్లులు కురుస్తున్నాయి. చాలా జిల్లాల్లో పట్టపగలే చీకట్లు కమ్ముకోవడంతో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో 18, నల్గొండ, సిద్దిపేట, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి తీవ్రత పెరిగి జనం వణికిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో వరుసగా రెండోరోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. వరంగల్ జిల్లాలో చాలా బడులు హాఫ్​డే మాత్రమే నడిచాయి.

వర్షాల కారణంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరి, మిర్చి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన పంట పొలాలు నేలవాలడంతో పాటు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. ఆరబోసే పరిస్థితి లేకపోవడంతో వడ్లు మొలకలు వస్తాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

కాశ్మీర్​ను తలపిస్తున్న ములుగు 

 వరంగల్ జిల్లాలో సోమవారం నుంచి మొదలైన ముసురు బుధవారం కూడా కొనసాగింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పగటిపూటే పొగ మంచు కమ్ముకుంది. చలికి జనాలు బయటకురావడం లేదు. పలు స్కూళ్లకు హాఫ్ డే సెలవు ఇచ్చారు. సాయంత్రం ఐదు గంటలకే చీకటి పడింది. బుధవారం భూపాలపల్లి, ములుగు జిల్లాలలో మోస్తరు వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో అత్యధికంగా 7 సెంటీమీటర్లు, మంగపేటలో 6.5, గోవిందరావుపేటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులతో మిర్చి, వరి పంటలు నేలకొరిగి రైతులకు నష్టం వాటిల్లింది. వరి పొలాల్లోనే వడ్లు మొలకెత్తుతున్నాయి. చిరుజల్లులు, మంచు కారణంగా ములుగు అటవీప్రాంతం కాశ్మీర్ ను తలపిస్తోంది.

వణుకుతున్న ఏజెన్సీ 

రెండు రోజులుగా మబ్బుపట్టి ఉండడం, చిరుజల్లులు కురుస్తుండడంతో ఉట్నూర్​ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. ఈదురు గాలులతో ఏజెన్సీ జనం ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటలకే చీకటి పడడంతో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, జనగామ, కామారెడ్డి, సిద్దిపేటలాంటి జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి జనం వణుకుతున్నారు.  

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో పంట నష్టం

ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం నుంచి  మబ్బులు పట్టి జల్లులు పడుతున్నాయి. అత్యధికంగా తిరుమలాయపాలెంలో 9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రెండురోజులుగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.  భారీ వర్షాల వల్ల జిల్లాలో 53 వేల మంది రైతులకు చెందిన 80 వేల ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి పంటలకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళ, బుధవారాల్లో రికార్డు స్థాయిలో వర్షం పడింది. అశ్వారావుపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 337.8 మిల్లిమీటర్లు, దమ్మపేట మండలంలో 260.2 మిల్లీమీటర్లు, పాల్వంచలో 250.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆఫీసర్లు ప్రకటించారు.