
నైరుతు రుతు పవనాల కాలం ముగిసింది.. ఇక వర్షాలు తగ్గుతాయి అనుకునేలోపే తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం (అక్టోబర్ 05) రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది.
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ లో 3.7సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా ముజ్గిలో 2.2సె.మీ నమోదవగా.. ఆదిలాబాద్ జిల్లా గుడిహథ్నూర్ లో 2.0సెమీ వర్షపాతం నమోదైంది.
మరోవైపు కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో కురుస్తున్న వర్షానికి పంటలన్నీ దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కల్లాలలో ఆరబోసిన సోయా పంట దిగుబడి వర్షార్పణం అయ్యింది. పంట తడిసిపోగా రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో అల్పపీడన ప్రభావంతో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. గత మూడురోజుల క్రితం ఆయా గ్రామాల్లో రైతుల తమ సోయాబీన్ పంటలు కోసి కల్లాల్లో అర బెట్టారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న సోయా తడిసిముద్దయ్యాయి. పలువురు రైతులు టార్పాలిన్లు కప్పి ఉంచారు. కొన్ని సోయా పంటలు కోత దశలో ఉండడంతో తో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటనష్టం జరిగిందని.. తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తానుర్, కుబీర్, ముథోల్, బైంసా మండలాల్లో భారీ వర్షం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హనుమంతరావుపేట్ వాగు పొంగి పొర్లడంతో మాధ్వార్, లింగనేపల్లి, గౌరవ తండా, బండ్రంపల్లి రాకపోకలు బంద్ . ఎవరు కూడా రావద్దని పోలీసులు చూచించారు.
అటు మంచిర్యాల జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంచిర్యాల,బెల్లంపల్లి,మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, జైపూర్ భీమారం మండలాల్లో కురుస్తున్న భారీ వర్షానికి వాగులూ వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోంది.